33.7 C
Hyderabad
April 29, 2024 02: 11 AM
Slider ప్రత్యేకం

జగన్ కు పోటీగా ఏపిలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తుందా???

#raghuramakrishnamraju

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొత్త పార్టీ పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజుపై వత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రఘు రామకృష్ణంరాజు ఇటీవల పెను సంచలనంగా మారారు. ఏపి సిఐడి పోలీసులు అరెస్టు చేసిన 48 గంటల్లో సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొంది సంచలనం సృష్టించారు.

అతి పెద్ద ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ కూడా తన ముఖ్యమైన నాయకులకు న్యాయ రక్షణ కల్పించడంలో విఫలం అయిన సందర్భంలో రఘు రామకృష్ణంరాజు దేశ అత్యున్నత న్యాయ స్థానం నుంచి న్యాయ రక్షణను రికార్డు సమయంలో పొందడం న్యాయ నిపుణులను సైతం ఆశ్చర్య పరిచింది.

ఎన్నో కేసుల్లో తమదైన శైలిలో వ్యవహరించిన ఏపి పోలీసులకు రఘురామ కృష్ణంరాజు కేసు ఒక్క సారిగా చుక్కలు చూపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము ఆడిందే ఆట అనుకున్న సమయంలో రఘురామకృష్ణంరాజు అనూహ్యంగా పోలీసు వల నుంచి తప్పించుకోవడం హతాశులను చేసింది.

ఈ ఒక్క సంఘటనతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సరైన ప్రత్యర్థి రఘు రామకృష్ణంరాజు అనే అభిప్రాయం చాలా మందిలో ఏర్పడింది. ఏపిలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం ఉన్నా నాయకులు సమర్ధంగా వ్యవహరించలేకపోతున్నారు.

అంతే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న దాష్టీకానికి లొంగిపోతున్నారు. ఎదురు తిరిగిన నాయకులపై పలు రకాల కేసులు వస్తుండటంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అడకత్తెరలో పోకలా తయారైంది.

అదే విధంగా బిజెపి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నది. బిజెపి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాంచి ఆఫీసులా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీతో జత కూడిన జన సేన పరువు కూడా పోతున్నది.

ఈ నేపధ్యంలో ఏపిలో రాజకీయ శూన్యత ఉందని, దాన్ని భర్తీ చేసేందుకు రఘురామకృష్ణంరాజు నడుంకట్టాలని ఢిల్లీ స్థాయిలోని ఆయన సన్నిహితులు కూడా సలహా ఇస్తున్నారు. రెడ్డి కమ్మ కాకుండా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్న ఏపి ప్రజలు సులభంగానే కొత్త పార్టీ వైపు ఆకర్షితులవుతారనే అంచనాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్లకుండా స్తబ్దుగా ఉండిపోయారు. తెలుగుదేశంవైపుగానీ, బిజెపి వైపుగానీ వారు కన్నెత్తి కూడా చూడటం లేదు.

ఇలాంటి క్యాటగిరి నాయకులు రఘురామకృష్ణంరాజు పార్టీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. అప్పుడు బలమైన నాయకత్వం అతి వేగంగా రూపొందే అవకాశం ఉంది.

అయితే కొత్త పార్టీ విషయంలో రఘురామకృష్ణంరాజు ఏ మాత్రం తొందరపడకుండా వ్యవహరించాలని ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Related posts

పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ దిగిపోవాలి

Satyam NEWS

జాతీయ జెండాపై మంత్రి వ్యాఖ్యలతో రణరంగంగా కర్నాటక అసెంబ్లీ

Satyam NEWS

ముఖేశ్‌ అంబానీ నివాసం వద్ద అలజడి .. పోలీసుల పహారా

Sub Editor

Leave a Comment