32.7 C
Hyderabad
April 27, 2024 01: 07 AM
Slider జాతీయం

సత్వర న్యాయం అందేలా న్యాయస్థానాలు చొరవతీసుకోవాలి

#Vice President of India

అత్యున్నత న్యాయస్థానం నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న అపరిష్కృత కేసుల విషయంలో ప్రభుత్వంతోపాటు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, న్యాయ మంత్రిత్వ శాఖలు దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు.

అన్ని స్థాయిల్లో 3 కోట్లకు పైగా కేసులు అపరిష్కృతంగా ఉండటం విచారకరమని ఆయన పేర్కొన్నారు. కేసుల సంఖ్య ఇలా పెరుగుతున్నందున కీలకమైన కేసుల్లోతీర్పు కూడా ఆలస్యమవుతోందన్నారు. తద్వారా సామాన్యులకు న్యాయప్రక్రియ చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతోందన్నారు.

పెరుగుతున్న కేసులపై ఉపరాష్ట్రపతి ఆవేదన

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయకళాశాల (ఆంధ్రయూనివర్సిటీ) 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వెబినార్‌లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసులపై ఆవేదన వ్యక్తం చేశారు.

కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా న్యాయ ప్రక్రియ ఆలస్యమవుతోందని.. తద్వారా సత్వర న్యాయం అందించలేమన్నారు. ‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అన్న మాటను ప్రస్తావిస్తూ.. కొన్ని సందర్భాల్లో అనవసరంగా కేసులను పొడగించడం, వాయిదా వేయడం జరుగుతోందన్నారు.

దీనిపై న్యాయవాదులతోపాటు ఈ రంగంతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముందన్నారు. ఇది ఎవరినీ విమర్శించేందుకు అనడం లేదని.. న్యాయశాస్త్రాన్ని అభ్యసించినవాడిగా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున.. తన దృష్టికి వచ్చిన అంశాలను ప్రస్తావిస్తున్నన్నారు.

సంక్లిష్ట చట్టాలను సరళతరం చేయండి

దీంతోపాటుగా క్లిష్టమైన చట్టాలను సరళీకృతం చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి అన్నారు. వినియోగంలో లేని 1600కు పైగా చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ దిశగా మరింత కృషి జరగాల్సి ఉందన్నారు. చట్టాల రూపకల్పన కూడా.. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా, స్పష్టంగా ఉండాలన్నారు.

ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పీఐఎల్) ఇటీవల.. ప్రయివేటు (వ్యక్తిగత) ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని అభిప్రాయపడ్డ ఉపరాష్ట్రపతి.. ఈ విషయంలోనూ చర్చ జరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

విశాల ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వేసే వ్యాజ్యాలు అవసరమేనని ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలను జోడించడం సరికాదని.. ఇది న్యాయస్థానాల విలువైన సమయాన్ని వ్యర్థం చేసినట్లే అవుతుందన్నారు. సమాజంలోని పేద, అణగారిన, వర్గాలకు న్యాయపరమైన సహాయం చేయాలని.. వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషిచేయాలని లా విద్యార్థులకు, యువ న్యాయవాదులకు ఉపరాష్ట్రపతి సూచించారు.

సమాజంలో మార్పు కోసం ప్రయత్నించాలి

నైతిక ప్రవర్తనను అలవర్చుకుని, నిర్భీతితో.. విధులు నిర్వహించాలన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో న్యాయవాదుల పాత్ర కీలకమనే విషయాన్ని గుర్తించాలని.. ప్రజల్లోచైతన్యం తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ టి.రజని, జస్టిస్ బట్టు దేవానంద్, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

ఇంకా, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ సుమిత్ర, న్యాయ విభాగం డీన్ ప్రొఫెసర్ డీఎస్ ప్రకాశ్ రావు, అంబేడ్కర్ న్యాయ కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. గుప్తేశ్వర్, ఖతార్ ప్రభుత్వ అటార్నీ జనరల్ కార్యాలయ ప్రత్యేక సలహాదారు డాక్టర్ పీఎస్ రావుతోపాటు పలువురు న్యాయకోవిదులు, న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

వనపర్తిలో మేఘా రెడ్డి ర్యాలీ

Satyam NEWS

వితంతువులకు ప్రత్యేక మహిళాశాఖ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

గ్రామీణ సమాజం మరియు సవాళ్ల మీద ఒకరోజు కార్యశాల

Satyam NEWS

Leave a Comment