విజయాలు సాధించడానికి అలవాటు పడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కూడా చరిత్ర ఎరుగని విజయాన్ని సాధించబోతున్నారు. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా కేసీఆర్ ఆర్టీసీ పై విజయం సాధిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నో సార్లు ఆర్టీసీ సమ్మె జరిగింది. కార్మికుల డిమాండ్లను అంగీకరించి లేదా యూనియన్ల మధ్య తగాదాలు పెట్టి సమ్మెను నిర్వీర్యం చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ ఈ విధంగా ఆర్టీసీపై విజయం సాధించబోతున్న సీఎం మాత్రం కచ్చితంగా కేసీఆరే అనడంలో సందేహం లేదు.
అత్యంత దారుణంగా, కటువుగా, అమానవీయంగా ప్రవర్తించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్టీసీని తొక్కి పెట్టారు. దాదాపు 27 మంది కార్మికులు ఆత్మహత్యలు, ఆకస్మిక మరణాలకు పాల్పడినా కేసీఆర్ మనసు కరగలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మాట అటుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలతో కనీసం చర్చలు జరిపేందుకు కూడా కేసీఆర్ ముందుకు రాలేదు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పిలిస్తే కనీసం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెళ్లను కూడా వెళ్లలేదు.
లాంఛనంగా రవాణా శాఖ కార్యదర్శి వెళ్లి మొక్కుబడిగా లెక్కలు చెప్పి వచ్చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎన్ని రకాల వినతి పత్రాలు ఇచ్చినా గవర్నర్ ఏం చేయలేకపోయారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా చేస్తామని చెప్పి కార్మికుల పక్షాన నిలిచిన బిజెపి కూడా చివరకు చేతులు ఎత్తేసినట్లే అయింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశంలేదని బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి చేరాయి.
కాంగ్రెస్ పార్టీ అయితే మరీ దారుణంగా ఆర్టీసీ సమ్మెలో తనదైన శైలిలో ముందుకు వెళ్దామనుకున్న ఎంపి రేవంత్ రెడ్డికి అడ్డుకట్టవేసి రాజకీయాలు చేసింది. రాష్ట్ర హైకోర్టు ఫుల్ టైం ఎండిని నియమించాలని చేసిన సూచన నుంచి ఏ సూచననూ కేసీఆర్ అంగీకరించలేదు. తద్వారా రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయింది. లేబర్ డిపార్ట్ మెంట్ కు కేసు బదిలీ చేసే పరిస్థితి వచ్చేసింది. అక్కడికి కేసు చేరితే అంతిమంగా కేసీఆర్ చేతిలోకి చేరినట్లే.
కేసీఆర్ ఆధీనంలో ఉన్న ఆ శాఖ ఇప్పటికే ఆర్టీసీ సమ్మెను చట్ట విరుద్ధమని ప్రకటించినందున ఆర్టీసీ కార్మికులు ఇక చేయగలిగింది ఏమీ ఉండదు. రోడ్లమీదకు వచ్చి కొట్లాడితే కరిగిపోవడానికి తాను గత పాలకుల లాంటి వాడిని కాదని కేసీఆర్ నిరూపించేశారు. ఇక మిగిలింది ఆర్టీసీ కార్మికులు వచ్చి విధుల్లో చేరిపోవడమే. అది కూడా కేసీఆర్ అంగీకరిస్తేనే….