28.7 C
Hyderabad
April 26, 2024 10: 35 AM
Slider సంపాదకీయం

ప్రధాని కరుణా కటాక్షం ఈ సారి లభించేనా?

#Y S Jaganmohan Reddy

బెయిలు నుంచి జైలుకే అన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో బెంబేలెత్తిపోయిన వైసీపీ నాయకుల ఢిల్లీ యాత్ర ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరుణిస్తారా లేదా అనే చర్చ విస్తృతంగా జరుగుతున్నది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎప్పటికప్పుడు సంచలనం కలిగిస్తున్న బెయిల్ రద్దు వ్యవహారం ఇప్పుడు క్లయిమాక్స్ కు వచ్చిందని కొందరు అంటుండగా మరి కొందరు మాత్రం కేంద్రంలో బిజెపి ఉన్నంత కాలం ఏ భయంలేదనే భరోసాతో ఉన్నారు. ఇటీవల బిజెపి జనాగ్రహ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన కేంద్ర మంత్రి, బిజెపి ముఖ్య నాయకులలో ఒకరు అయిన ప్రకాష్ జవదేకర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అగ్గి రగిల్చిన ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యలు

బెయిల్ పై ఉన్న వారు తర్వలోనే జైలుకు వెళతారన్న ఆయన వ్యాఖ్యలు చేసిన క్షణం నుంచి వైసీపీ నేతల గుండెల్లో గుబులు బయలుదేరింది. కేంద్రంలో బిజెపి వైఖరి మారిందా అనే సందేహంతో వైసీపీ నాయకులు ఢిల్లీలో బిజెపి అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించారు.

బిజెపి వైఖరి ఏమిటో తెలుసుకోవడానికి నానా కష్టాలూ పడ్డారు. ఈ క్రమంలోనే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరారు. ప్రధాని తనను కలవడానికి సమయం ఇవ్వగానే జగన్ ఎంతో సంతోష పడ్డారని చెబుతున్నారు.

తన పట్ల సానుకూలత లేకపోతే ప్రధాని తనను కలిసేందుకు ఎందుకు అంగీకరిస్తారని ఆయన అభిప్రాయపడుతున్నారని అంటున్నారు. గతంలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలోని బిజెపి నేతలు వైసీపీ పట్ల అనుసరిస్తున్న మెతక వైఖరిని ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఆ పార్టీ పట్ల మెతక వైఖరి అవలంబించడంపై అమిత్ షా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

అమిత్ షా ప్రకటనతో మొదలైన గుండె దడ

అమిత్ షా ప్రకటనతోనే వైసీపీ నాయకుల గుండెల్లో దడ మొదలైంది. ఆ తర్వాత బిజెపి నిర్వహించిన జనాగ్రహ సభలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బెయిలు జైలు వ్యాఖ్యలతో వైసీపీ నాయకుల కు గుండె దడ పెరిగింది. కేంద్రంలో బిజెపి తన వైఖరిని మార్చుకుంటే తమకు కష్టాలు తప్పవనే స్థిర నిర్ణయంతో ఉన్న వైసీపీ నాయకులు బిజెపి నేతల ప్రసన్నం కోసం ప్రయత్నించారు.

షా తమ పట్ల తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందున ప్రధానిని కలిస్తే మంచిదనే నిర్ణయానికి వారు వచ్చారు. ప్రధాని కూడా అప్పాయింట్ మెంట్ ఇవ్వడంతో వైసీపీ నేతలలో సంతోషం కనిపించింది. అయితే బిజెపి వైఖరి మారి ఉంటే ప్రధాని సాయం చేస్తారా? అనే సందేహం మాత్రం అలానే ఉంది.

ఆశించిన ఫలితం వస్తుందా……?

జగన్ ప్రధానిని కలిసిన తర్వాత గానీ వైసీపీ నేతల మనసు కుదట పడే అవకాశం కనిపించడం లేదు. అయితే బిజెపి నుంచి తాము ఆశించే సహకారం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కొందరు వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టులో వేసిన బెయిల్ రద్దు కేసు పై తీర్పు రిజర్వులో ఉంది.

ఆ తీర్పు తాము ఆశించినట్లు లేకపోతే వైసీపీకి కష్ట కాలం దాపురిస్తుంది. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని అప్పాయింట్ మెంట్ దొరకడం సంతోషం కలిగించే అంశమే అయినా ఫలితం ఎలా ఉంటుందనే అంశంపై మాత్రం అందరికి అనుమానంగానే ఉంది.   

Related posts

అర్నాబ్ గోస్వామిపై దాడిని ఖండించిన కిషన్ రెడ్డి

Satyam NEWS

డిజిపిని కలిసిన రమ్య కుటుంబ సభ్యులు

Satyam NEWS

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 371 జయంతి

Satyam NEWS

Leave a Comment