36.2 C
Hyderabad
April 27, 2024 22: 18 PM
Slider సంపాదకీయం

పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలు సక్రమంగా జరిగేనా?

#apmap

కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఏపిలో స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణం ఉన్నదా అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వహించాల్సిన కింది స్థాయి అధికారులు అందరూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఏరికోరి తెచ్చుకున్న మనుషులే. దీనికి తోడు వాలంటీర్ల వ్యవస్థ ఉండనే ఉన్నది. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయిలో ఉన్న మహిళా పోలీసులు ఈ వ్యవస్థలన్నీ వైసీపీ నేతలే ప్రభావితం చేస్తున్నారు. కేవలం ప్రభావితం చేయడమే కాదు. ఈ వ్యవస్థలన్నీ వారి గుప్పిటలోనే ఉన్నాయి.

క్షేత్రస్థాయి అధికారుల పరిస్థితి ఇలా ఉంటే తాసిల్దార్ స్థాయి వ్యక్తులు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అప్పాయింట్ చేయించుకున్నవారే. చాలా మంది డిఎస్పీలు, ఎస్ పిలు అయితే నేరుగా వైసీపీ పెద్దలు తమకు కావాల్సిన రీతిలో ఏర్పాటు చేసుకున్నవారే. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై అసందర్భంగా కేసులు పెట్టడం వరకూ చూస్తే ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఏపీలో స్వేచ్ఛగా పని చేసే అవకాశం ఉన్నదా అనే ప్రశ్న తలెత్తుతున్నది.

అధికారంలోకి వచ్చిన నాలుగన్నరేళ్లలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్నారని ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ వార్తలకు మరింత బలం చేకూరిందని ఆ పార్టీ యువనేత, చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడు నారా లోకేష్‌ ఆధారాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తనపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నా, జగన్‌ ఒక్క కేసులోనూ కోర్టుకి హాజరుకావడం లేదని, ఇటు సొంత బాబాయ్‌ వైఎస్‌ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ,  జగన్‌ సోదరుడు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి నిందితుడు అని సాక్ష్యాధారాలు ఉన్నా జగన్‌ కాపాడుతున్నారని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.

ఇలా వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న వైసీపీ సర్కార్‌, తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని సైతం బెదిరిందించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు తన వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్‌కేలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సంచలన కామెంట్స్‌ కూడా చేశారు. “ఇక రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకల వ్యవహారం మరో ముఖ్యాంశం. ఈ అవకతవకలపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనాకు హెచ్చరికలు వెళ్లాయని వార్తలొచ్చాయి.

ప్రతిపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటే ఇప్పటికే సీఐడీ నమోదు చేసిన మద్యం కేసులో మీ పేరు కూడా ఉంటుందని ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదీ అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దలతోపాటు, సీఎంవోలోని అధికారులూ ఈ మేరకు హెచ్చరికలు చేసినట్టు తెలుస్తుండడం మహా పతనానికి మరో ఉదాహరణ. బరి తెగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొనే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది కదా? ఎన్నికల ప్రధాన అధికారిని బెదిరిస్తున్న విషయమై విచారణ జరిపి నిజమని తేలితే సదరు బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపై చర్యలకు ఎన్నికల కమిషన్‌ తక్షణం ఉపక్రమించాలి.

ఎన్నికల వేళ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయడానికి కేసుల మీద కేసులు పెడుతూ ఉండటం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులలో మిమ్మల్ని కూడా ఇరికిస్తామని ఐఏఎస్‌ అధికారులను బెదిరించడం దారుణం కాదా? ఒకవైపు అధికార యంత్రాంగాన్ని పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించడం, మరోవైపు తమ దారిలోకి రాని అధికారులను కేసులలో ఇరికిస్తామని బెదిరించడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇంతలా దిగజార్చిన తర్వాత ప్రజలకు ఇక రక్షణ ఏముంటుంది? రూల్‌ ఆఫ్‌ లా ఎలా అమలవుతుంది? ఈ పరిస్థితులలో న్యాయస్థానాలు కూడా నిస్సహాయంగా ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది అని రాధాకృష్ణ తన కాలమ్ లో పేర్కొన్నారు.

తన వీకెండ్‌ కామెంట్‌లో రాధాకృష్ణ చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో సెగలు రేపుతున్నాయి.. ఓటర్ల జాబితా అవకతవకలపై ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులను లైట్‌ తీసుకోవాలంటూ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌ కుమార్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆయన ఈ వ్యాసంలో  తెలిపారు.. ఈ అంశంలో తమ హెచ్చరికలను కాదని ముందుకు వెళితే, ఏదో ఒక కేసులో ఆయన పేరుని కూడా జత పరచాల్సి ఉంటుందని సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు ఆర్‌కే.. ఇదే నిజం అయితే జగన్‌ సర్కార్‌ ఏ స్థాయిలో అధికారులపైనా బెదిరింపులకు పాల్పడుతుందో అర్ధం చేసుకోవచ్చు..

జగన్‌కి గత ఎన్నికలు కంటే ఈ ఎన్నికలు ఎంతో కీలకంగా మారనున్నాయి.. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ సర్కార్‌ అనేక కుంభకోణాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. మద్యం, ఇసుక, వైఎస్‌ఆర్‌ కాలనీలతోపాటు అనేక కుంభకోణాలు బయటకు వచ్చే ప్రమాదం ఉంది.. ఇటు, ఎలాంటి ఆధారాలు లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబుని జైలుకి పంపారు జగన్‌.. దీంతో, చంద్రబాబు సైతం ప్రతీకారంతో జగన్‌ని జైలుకి పంపాలని భావిస్తే, మద్యం, ఇసుక స్కామ్‌లలో ఆధారాలు సాధించడం కష్టమేమీ కాదనే అభిప్రాయం ఉంది.. ఇదే జరిగితే, జగన్‌ని చాలా కాలం పాటు జైలుకి పరిమితం చేయడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వెల్లడిస్తున్నారు విశ్లేషకులు..  వైసీపీని, జగన్‌ని ప్రస్తుతం ఈ లెక్కలే భయపెడుతున్నాయి. అందుకే, ఏపీలో మరోసారి తానే అధికారంలోకి రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.. తన అస్త్రశస్త్రాలు అన్నింటినీ ప్రయోగిస్తున్నారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి..

Related posts

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో…

Satyam NEWS

మట్టి గణపతి విగ్రహాలు ప్రతిష్టించాలి

Bhavani

పోలీస్ స్టేషన్ లో సజీవదహన యత్నం

Bhavani

Leave a Comment