40.2 C
Hyderabad
April 26, 2024 13: 19 PM
Slider ప్రత్యేకం

రఘురామ లేఖాస్త్రం: తెలుగుకు తెగులు పట్టించవద్దు

#RRR letter

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాస్తున్న లేఖలు సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగు భాష అమలుపై ఆయన నేడు లేఖాస్త్రాన్ని సంధించారు. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ తెలుగు భాషను ప్రజలకు దూరం చేయవద్దని కోరుతూ ఆయన ఎంతో ఆవేదనాభరితంగా లేఖ రాశారు. తెలుగు భాషను మర్చిపోయేలా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని, తక్షణమే సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రఘురామకృష్ణంరాజు సిఎం జగన్ కు రాసిన లేఖ పూర్తి పాఠం ఇది:

ముఖ్యమంత్రి గారూ,

ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మపాట పాడినట్టి భాష

తేనె వంటి మందు వీనులకును విందు దేశభాషలందు తెలుగులెస్స!

సంస్కృతంబులోని చక్కెర పాకంబు అరవభాషలోని అమృతరాశి

కన్నడంబులోని కస్తూరి వాసన కలిసిపోయే తేట తెలుగు నందు

వేలవేల కవుల వెలుగులో రూపొంది దేశదేశములను వాసిగాంచి

వేయియేండ్ల నుండి విలసిల్లు నా భాషా దేశభాషలందు తెలుగు లెస్స!

ఈ మాటలు అన్నది ఒక తెలుగువాడు కాదు. తుళు మాతృభాషగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన కవితాధార ఇది. అంటే పరభాష వారికే తెలుగు ఇంత మధురమైన భాషగా అనిపిస్తుంటే తెలుగు వాడిగా పుట్టి, తెలుగు భాషను నోరారా మాట్లాడుకుంటున్న మనం ఎంత అదృష్టవంతులం?

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తొలగించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న మీ నిర్ణయం ఇప్పుడు ప్రతి తెలుగువాడి గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటున్నది. మధురమైన తెలుగు నుంచి మన భావితరాలు దూరం జరిగిపోతున్నాయన్న బాధతో భాషాప్రియులు ఎంతో ఆవేదనతో ఉన్నారు.

పసి పిల్లలు మనం ఏం చెబితే అది నేర్చుకుంటారు. ‘‘నీ మాతృభాషలో నీకు మనుగడ లేదు. పరాయి భాష నేర్చుకుంటే తప్ప నీ జీవితం బాగుపడదు’’ అంటూ పాలకులుగా ఉన్న మనమే చెబితే పిల్లలు, తెలుగు భాషలో బోధించే నీతి సూత్రాలకు, పరమజీవిత సత్యాలను వివరించే వేమన పద్యాలకు, మహామహుల ఆదర్శ జీవన విధానాలకు, దేశభక్తి పెంపొందించే గురజాడ వారి సాహిత్యానికి, సౌరభాలు వెదజల్లే తెలుగు గ్రంధాలకు వారు దూరమైపోరా? ఈ పరిస్థితి తలెత్తితే వారికి దేశమంటే గౌరవం ఉంటుందా? కన్న తల్లిదండ్రులంటే ఆపేక్ష ఉంటుందా?

ఇవన్నీ పక్కన పెట్టినా, రాష్ట్రం మొత్తంలోని 69561 ప్రాధమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే మీ నిర్ణయం అమలు చేసేందుకు అవసరమైన యంత్రాంగం ఉందో లేదో అని అయినా మీరు ఆలోచించారా? ఇంగ్లీషు భాషలో చెప్పేందుకు అవసరమైనంత మంది ఉపాధ్యాయులు ఉన్నారో లేదో చూశారా? ఇంత కాలం తెలుగు మాధ్యమంలో బోధించిన ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియంలో చెప్పేందుకు తర్ఫీదు ఇచ్చారా?

అసలు మరో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులో తెలుగును కనీసం ద్వితీయ భాషగా పెడుతున్నట్లు కూడా స్పష్టంగా చెప్పలేదు. భారత దేశంలో హిందీ తర్వాత అతి ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. అలాంటి తెలుగు భాష ప్రాశస్త్యాన్ని తెలుగు రాష్ట్రం లోనే చిదిమేస్తే పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంటుంది.

ఒక్క సారి తమిళనాడు లోని నాయకులను చూడండి. వారు తమ భాషను ఎంతగా ప్రేమిస్తారో అర్ధం అవుతుంది. తెలుగు భాషను మీలాంటి వారు ప్రేమించకపోయినా ఫర్వాలేదు. ప్రత్యేకమైన అభిమానం ప్రదర్శించకపోయినా ఏమీ కాదు. తరతరాలుగా తెలుగు భాష తనంతతానుగానే దేదీప్యమానంగా వెలుగుతూనే ఉన్నది. అయితే మీరు తీసుకుంటున్న చర్యలు తెలుగు భాషను కొడిగట్టేలా చేస్తున్నాయి. ఇది తలచుకుంటే తెలుగువాడిగా తీవ్రమైన ఆవేదన కలుగుతున్నది.

ఇటీవల కేంద్ర మంత్రి వర్గం నూతన విద్యావిధానాన్ని ఆమోదించింది. ప్రాధమిక స్థాయిలో విద్యార్ధులకు బోధన మాతృభాష లేదా స్థానిక భాష లేదా ప్రాంతీయ భాషలో మాత్రమే ఉండాలని నూతన విద్యా విధానంలో విస్పష్టంగా చెప్పారు.

మీ తండ్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకువచ్చిన చట్టం గురించి తెలుసుకున్నా కూడా మీరు తెలుగు భాషను అంతం చేయాలనే నిర్ణయం తీసుకుని ఉండరు. విద్యా హక్కు చట్టం, 2009ను అమలు చేయడంలో భాగంగా డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బాలల నిర్బంధ ఉచిత విద్యా చట్టం 2010 తీసుకువచ్చారు. ఆ చట్టంలో ఎంతో స్పష్టంగా, సాధ్యమైనంత వరకూ పిల్లలకు వారి మాతృభాషలోనే విద్యాబోధన జరపాలని నిర్దేశించారు. అయితే మీరు మీ తండ్రి నిర్ణయానికి పూర్తిగా విరుద్ధంగా వెళుతున్నారు. తెలుగు సరిగా నేర్చుకోకపోవడం, తెలుగులో స్పష్టంగా మాట్లాడలేకపోవడం తెలుగు భాషను అవమానించడమే కాదు. మన కన్నతల్లిని అవమానించడం లాంటిది.

ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టడం ఒక అభ్యుదయవాద చర్యగా మీరు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర హైకోర్టు ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టేసిన తర్వాత మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి కూడా ఇదే విషయం చెప్పారు. మాతృభాషలోనే విద్యా బోధన జరగాలనే అంశం విద్యా హక్కు చట్టంలో ఎక్కడా లేదని కూడా మీరు వాదించారు. అయితే రాజ్యాంగంలోని 350(ఏ) అధికరణలో ఈ విషయం స్పష్టంగా ఉందన్న అంశాన్ని నేను పార్లమెంటులో ప్రస్తావించాను కూడా. నేను ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటులో రాజ్యాంగ సంబంధింత అంశాలను ప్రస్తావించినందుకు మీరు నాపై ఆగ్రహించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు చెబుతూ నన్ను అనర్హుడిగా ప్రకటించేందుకు ప్రయత్నించారు.

గ్రేట్ బ్రిటన్ లో ఉన్న అతి చిన్న దేశం వేల్స్. లండన్ నుంచి 211 మైళ్ల దూరంలో ఉన్న ఆ దేశంలోని ప్రజలు తమ మాతృభాషను అమితంగా ప్రేమిస్తారు. బ్రిటన్ సామ్రాజ్యంలో వందల ఏళ్ల పాటు నలిగిపోయిన చాలా దేశాలలో బానిస భావనలతో ఇంకా ఇంగ్లీష్ పై మమకారం చంపుకోలేకపోతుంటే వేల్స్ ప్రజలు మాత్రం సామ్రాజ్యవాద పీఠానికి అతి చేరువలో ఉండి కూడా తమ మాతృభాషను బతికించుకుంటున్నారు.

బీహార్ రాష్ట్రంలోని బీహారీలు తమ మాతృభాష అయిన మైథిలిని ప్రభుత్వం గుర్తించాలని చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఇలా చెప్పాలంటే చాలా ప్రాంతాలలో తమ భాషను బతికించుకోవడానికి ప్రజలు ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో మన మాతృభాషను బతికించుకోవడానికి కాదు సరికదా దాన్ని చంపేసేందుకు ఆంగ్లభాషను నెత్తికెత్తుకుంటున్నాం.

ప్రపంచంలోనే అతి పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు అయిన చైనా, జర్మనీ తమ భాషలోనే ఉపయోగిస్తాయి. ఆ దేశాలలో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఇంగ్లీష్ వాడుతారు. మీరు పాలసీని మార్చే ముందుకు ఇలాంటి అన్ని అంశాలను పూర్తిగా అధ్యయనం చేసి ఉంటే బాగుండేది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన మీరు కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా తెలుగు గురించి తెలుసుకుని ఉంటే మరింత బాగుండేది.

మీకు తెలుగు గురించి మరింత ఆసక్తికరమైన విషయాలను చెప్పాలని అనుకుంటున్నాను. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనేంత మధురమైన తెలుగును ఎంతో మంది బ్రిటీష్ వారు కూడా నేర్చుకున్నారు. తెలుగు పద కోశాన్ని రూపొందించిన సి పి బ్రౌన్ ఆ కోవలో ముందుండే మహనీయుడు. ఆయన తెలుగు భాషపై ఎంత పట్టు సాధించారంటే మనలాంటి తెలుగు వారికి దిక్సూచిగా ఉండేందుకు పదకోశం రూపొందించారు. మరో విషయం ఏమిటంటే ఆయన మీ సొంత జిల్లా అయిన కడపలోనే పని చేశారు. ఆయన పేరు మీద మీ జిల్లాలో ఒక గ్రంథాలయం కూడా ఉంది. బహుశ మీరు ఆ గ్రంథాలయానికి ఎప్పుడూ వెళ్లి ఉండరు.

జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రాధమిక స్థాయిలో విద్యా బోధన జరగాలని స్పష్టంగా ఉన్నందున ఇంగ్లీష్ లో బోధన ప్రవేశపెట్టాలన్న మీ సంకల్పం నెరవేరే అవకాశం నాకైతే కనిపించడం లేదు. దేశంలోని న్యాయస్థానాలు చట్టాలకు, రాజ్యాంగానికి గౌరవం ఇస్తాయి…. వాటినే అనుసరిస్తాయి కాబట్టి మీరు ఎంత పెద్ద స్థాయిలో న్యాయపోరాటం చేసినా మీరు అనుకున్న ఫలితం రాకపోవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు. మీరు ఎన్నికల ప్రణాళికలో పెట్టినంత మాత్రాన తెలుగు భాషను శాశ్వతంగా దూరం చేసే పనిని మీరు సాధించలేరని పరిస్థితులను బట్టి అర్ధం అవుతున్నది. ఒక వేళ మీరు అనుకున్నదే జరగాలంటే పార్లమెంటులో మూడొంతుల మంది కూర్చుని రాజ్యంగాన్ని సవరించాల్సి ఉంటుంది. మీ కోరిక నెరవేర్చడం కోసం పార్లమెంటు ఉభయ సభలు తమ విలువైన సమయాన్ని ఇంతగా వినియోగిస్తాయని ప్రజలు అనుకోవడం లేదు.

మీరు తెలుగును తొక్కేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పరంగానో మరే అవసరం కోసమో ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధమని మాత్రమే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల మీరు ఇప్పటికైనా తెలుగు భాష ఔన్నత్యాన్ని తెలుసుకోండి. రాజ్యాంగం ఏం చెబుతున్నదో వివరం చూడండి. తెలుగు భాషాభిమానుల మనోవేదన ఆలకించండి. అ అంటే అమ్మ… ఆ అంటే ఆవు.. ఇ అంటే ఇల్లు…. అనే పచ్చని పసిడి తెలుగు పదాలను చెరిపేయవదు. పసి మనసులను అమ్మ నుంచి, అమ్మ మాట్లాడే భాష నుంచి దూరం చేయవద్దు. అమ వొడిలో పాడే లల్లాయి పాటలను పసికందులకు వినిపించకుండా చేయవద్దు. పర భాషలో పాండిత్యం సంపాదించాలన్నా మాతృభాషలోనే ఆలోచించాలనే చిన్ని లాజిక్ ను అర్ధం చేసుకోండి. ఇప్పటికైనా తెలుగు భాషను చిదిమేయాలనే మంకుపట్టుతో వేసిన వ్యాజ్యాలను ఉపసంహరించుకోండి. జాతీయ విద్యా విధానాన్ని తూచా తప్పకుండా అనుసరించి మీ గౌరవం పెంచుకోండి…. అలానే ఆంధ్రప్రదేశ్ గౌరవం పెంచండి.

భవదీయుడు

కె.రఘురామకృష్ణంరాజు

Related posts

స్టేట్ మెంట్: కమ్మోళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు

Satyam NEWS

మహిళలు స్వశక్తితో ముందుకు సాగాలి

Satyam NEWS

 తుమ్మల పయనమెటు

Murali Krishna

Leave a Comment