ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఈసారి అధికారం దక్కడం గగనమేనని ఇప్పటికే ఎన్నో సర్వేలు తేల్చేశాయి. వైసీపీ సొంత సర్వేలలో కూడా ఓటమి తప్పదని తేలిపోయింది. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపేందుకు ఏపీ ప్రజలు సిద్ధమైపోయారు. అయితే జగన్ మాత్రం ఎలాగైనా కనీసం పరువు నిలుపుకునే స్థానాలు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆయన వేస్తున్న ఎత్తులు మొదటికే మోసం తెస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు ద్వారా ప్రజా వ్యతిరేకతను ఏదో ఒక మేరకు తగ్గించుకోవచ్చన్న వ్యూహంతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగు ఎమ్మెల్యేల మార్పునకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తొలి విడతగా 11 మందిని నియోజకవర్గాలు మార్చేసిన జగన్.. ఇప్పుడు రెండో విడతలో 40 మందిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగున్నరేళ్లగా తెరుచుకోని తాడేపల్లి ప్యాలెస్ గేట్లు ఇప్పుడు అభ్యర్థులతో చర్చల కోసం తెరుచుకున్నాయి. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలు, జిల్లాల వారీగా ఈ సీట్ల మార్పుపై వైసీపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు.
కొందరు అభ్యర్థులతో సీఎం జగన్ నేరుగా మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగా.. మిగతా వారిని వైసీపీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి వారు ఓదార్చి బుజ్జగిస్తున్నారు. జగన్ నిర్ణయాలను కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యతిరేకిస్తుండగా మరికొందరు తిరుగుబాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు సీనియర్లు, మంత్రులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. ఇంకొందరు అసలు పోటీకే దూరమని చేతులెత్తేస్తున్నారు.
జగన్ కు అంత్యంత సన్నిహితులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇప్పటికే శాసన సభ్యత్వానికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేయగా, అదే బాటలో ఇప్పుడు మరికొందరు కూడా నడుస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ రాజీనామాకు రెడీ అయిపోయారు.
వీరిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌లు తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు, ఇక పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు జనసేనతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. ఈ ముగ్గురికీ వైసీపీలో ఈసారి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని జగన్ తేల్చి చెప్పడంతో వీరు ముగ్గురూ పార్టీకే గుడ్ బై చెప్పేయడానికి రెడీ అయిపోయారు. తమకు వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వకపోయినా ఫరవాలేదు, పార్టీలో చేర్చుకుంటే చాలని వీరు తెలుగుదేశం, జనసేనలకు రాయబారం పంపినట్లు తెలుస్తున్నది. జగన్ ఓటమే తమ లక్ష్యంగా పని చేస్తామని కూడా వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పటికే కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు. జనవరి 5న ఆయన సైకిలెక్కేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరిలో పర్వత ప్రసాద్ తెలుగుదేశం గూటికి, పెండం దొరబాబు జనసేనలోనూ చేరబోతున్నట్లు రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తుంది.
గడప గడపకి వైసీపీ, మా నమ్మకం నువ్వే జగన్, సాధికారిక బస్సు యాత్రల పేరిట వైసీపీ గత ఆరు నెలలుగా ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాలలో తిప్పారు. ప్రజల నుండి వ్యతిరేకతలు వచ్చినా సర్ది చెప్పుకున్నారు. కొన్ని చోట్ల చీదరింపులు ఎదురైనా ఓర్చుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేతను ప్రజలు ఎమ్మెల్యేలపై చూపి చీవాట్లు పెట్టినా ఎలాగోలా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రతి కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో విజయవంతం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ చివరికి అధిష్టానం టికెట్లు లేవని చేతులెత్తేయడమో, లేదంటే ఇక్కడ కాదు మరోచోటకి వెళ్లాలని ఆదేశించడమో చేస్తుండటాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ సొంత నియోజకవర్గంలోనే తమకి పట్టు ఉందని.. స్థానం మారితే తమకి భవిష్యత్ ఉండదని ఎమ్మెల్యేలు ఎంత మొత్తుకున్నా జగన్ పట్టించుకోకపోవడంతో ఇక వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదని నిర్ణయించుకొని బైబై చెప్పేస్తున్నారు.తెగతెంపులు చేసేసుకుంటున్నారు. అవతలి పార్టీలలో టికెట్లు దక్కవని తెలిసినా. ప్రభుత్వం ఏర్పాటయ్యాక అయినా కనీసం ఏదో ఒక పదవి దక్కకపోతుందా అని సర్దుకుపోతున్నారు. ఈ ముగ్గురే కాదు కనీసం ముప్పై మందికి తక్కువ కాకుండా వైసీపీ సిట్టింగు ఎమ్మెల్యేలు రాజీనామాల బాటలో ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.