27.7 C
Hyderabad
April 26, 2024 05: 42 AM
Slider సంపాదకీయం

సినిమా చూపిస్త మామా: ఇదేం ఖర్మరా రామా?

#bheemlanayak

సినిమా టిక్కెట్లపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై ఏం చేయాలో, ఎలా చేయాలో సినీ రంగాన్ని ఛిద్రం చేసే ఆ నిర్ణయాలను ఎలా ఆపాలో అర్ధం కాక తెలుగు సినీ పెద్దలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని రాజకీయంగా అడ్డుకోవడానికి సినీ రంగం మొత్తాన్ని చిదిమేసే ఆలోచనను జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు.

సినీ టిక్కెట్లను ప్రభుత్వమే బుక్ చేయడం, ఆ డబ్బుల్ని తమ వద్దే ఉంచుకుని ఆ తర్వాత ప్రభుత్వమే డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, నిర్మాతకు డబ్బులు పంపిణీ చేయడం అనే ఆలోచన జగన్ కు ఎలా వచ్చిందో ఎవరికి అర్ధం కావడం లేదు. అంతకు ముందు పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ వచ్చినప్పుడు సినిమా టిక్కెట్ల విషయంలో తీవ్రమైన వివాదం రేపిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు మొత్తం సినీ రంగానికే సవాల్ విసిరింది.

వకీల్ సాబ్ చిత్రం విడుదల, టిక్కెట్ల బుకింగ్ సమయంలో ప్రభుత్వం చేసిన గందరగోళంతో ఆ సినిమాకు కలెక్షన్లు తగ్గాయి కానీ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దాదాపు 300 నుంచి 400 కోట్లు వసూలు చేసే స్టామినా ఉన్న వకీల్ సాబ్ ను 150 కోట్లకు మాత్రమే పరిమితం అయ్యేలా జగన్ ప్రభుత్వం పకడ్బందిగా ప్లాన్ వేసింది. దీనివల్ల ఎగ్జిబిట్లరకు, డిస్ట్రిబ్యూటర్లకు తీరని నష్టం వాటిల్లింది.

రాబోయే ఎన్నికల లోపు దాదాపు ఐదు చిత్రాలలో నటించాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగానే ఆయన ముందుకు వెళుతున్నారు. కరోనా కారణంగా ఆయన అనుకున్న లక్ష్యం మేరకు ముందుకు కదలడానికి కొన్ని ప్రతిబంధకాలు ఎదురు అవుతున్నా కూడా ఆయన ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నారు.

దీన్ని అడ్డుకోవడానికి పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తే నష్టం వస్తుందనే మెసేజి పంపేందుకు జగన్ ప్రభుత్వం అన్ని ఆలోచనలు చేస్తున్నదని సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా అభిప్రాయపడుతున్నారు. కొత్త సినిమా విడుదలైనప్పుడు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు అంతకు మించి కూడా అభిమానులు ఖర్చు చేసి బెనిఫిట్ షోలు వేయించుకునేవారు. దీన్ని సామాన్య ప్రజలకు ఆపాదిస్తూ విచ్చలవిడిగా టిక్కెట్ల ధరలు పెట్టడం వల్ల వారు ఇబ్బంది పడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు.

అందుకే టిక్కెట్ల ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని పుంఖానుపుంఖాలుగా సోషల్ మీడియాలో ప్రజల అభిప్రాయంగా చెప్పించారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలుగు సినీ ప్రముఖులు ఎవరూ కూడా ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు. అయితే సినీ పరిశ్రమ మొత్తం ఒక్క సారిగా సైలెంట్ అయిపోయింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాత్రం టిక్కెట్లను ప్రభుత్వం తీసుకోవడంపై కొత్త కొత్త వాదనలు ముందుకు తీసుకువచ్చింది. వాట్సయాప్ యూనివర్సిటీలో టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మడానికి అనుకూలంగా వ్యాసాలు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన ఒక ‘‘రెడ్డి’’ నిర్మాత పేరుతో, ఆయన పెట్టుకున్న ఒక సంస్థ పేరుతో కూడా మెసేజీలు బాగా సర్క్యులేట్ అయ్యాయి. నిర్మాత తన సొంత డబ్బులతో తీసే సినిమాకు వచ్చే కలెక్షన్లను ప్రభుత్వం తన ఖాతాలో ఎలా జమ చేసుకుంటుంది? అనేది ప్రధాన ప్రశ్న.

ప్రభుత్వమే పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకుని కలెక్షన్లు తీసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇష్టం ఉన్నవాడు చూస్తాడు లేనివాడు లేదు ( అది కూడా ఇంటికో సినిమా టిక్కెట్లు కొనాల్సిందేనని నిబంధన పెడితే చెప్పలేం) ప్రయివేటు పెట్టుబడులను ప్రభుత్వం రెగ్యులేట్ చేయడం ఏమిటి? మా ఇష్టం ఎవరూ ఏమీ మాట్లాడేందుకు వీలేలేదు అని అంటే ఎవరూ చెప్పేదేమీ లేదు.

సినిమా రంగం మొత్తం రెండు కులాల చేతిలో ఉందని, ఆ రెండు కులాలను ఆర్ధికంగా దెబ్బకొడితే తప్ప తమకు మనుగడ లేదని ఎవరైనా భావిస్తే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు. కమ్మ, కాపు కులాలను దృష్టిలో ఉంచుకుని వారిని నాశనం చేయాలని చూస్తే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అందులో పని చేసేవారు, సినిమా నిర్మాణంలో వివిధ క్రాఫ్టుల్లో పని చేసేవారు అందరూ కమ్మ లేదా కాపు కులస్తులే కాదు.

అన్ని రకాల కులాల వారు ఉంటారు. ఏపి ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ నిర్ణయం పూర్తిగా అమలు జరిగిన తర్వాత పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోలు సినిమాలు తీయడం దాదాపుగా నిలిపివేవచ్చు. ఎందుకంటే ఆంధ్రా, సీడెడ్ దాదాపు 70 శాతం ఉంటుంది. నైజాం (హైదరాబాద్ తో కలిపి) 20 శాతం ఉంటుంది.

మిగిలింది ఓవర్సీస్ బిజినెస్ ఉంటుంది. ఆంధ్రా సీడెడ్ లలో బిజినెస్ అయ్యే అవకాశం లేకపోతే పెద్ద సినిమాలకు వర్కవుట్ కాదు. పెద్ద సినిమాలు లేకపోతే ఈ వెబ్ సీరీస్ తోనూ, షార్టు ఫిలిమ్ లతోనూ సినీ పరిశ్రమ నడవదు. ఫలితంగా సినీ పరిశ్రమ నాశనం అయిపోతుంది. ‘‘పవన్ కళ్యాణ్ ను బహిష్కరిస్తున్నాం…’’ అని సినీ పరిశ్రమ ప్రకటిస్తే బహుశ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆగుతుందేమో… తెలియదు.

పవన్ కళ్యాణ్ సినిమాలు ఇలాగే ‘‘వ్యూహాత్మకంగా’’ అడ్డుకుంటూ ఉంటే ఆయన తన పూర్తి సమయాన్ని రాజకీయాలకు వెచ్చించే అవకాశం ఉంటుంది. అప్పుడు జగన్ ప్రభుత్వానికి మరింత పెద్ద దెబ్బ తగులుతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ సినిమాల జోలికి వెళ్లకుండా, ఆయనను దృష్టిలో ఉంచుకుని సినీ పరిశ్రమను దెబ్బకొట్టే పనులు మానుకోవడం జగన్ ప్రభుత్వానికే శ్రేయస్కరం.

Related posts

రాజన్న రాజ్య స్థాపనకు రాజీలేని పోరాటం చేద్దాం

Satyam NEWS

సెలవు దినాలలో వ్యవసాయ రైతు కూలీగా తస్లీమా

Satyam NEWS

పసుపు మార్కెటింగ్ లో కేంద్రం విఫలం

Satyam NEWS

Leave a Comment