38.2 C
Hyderabad
April 29, 2024 13: 14 PM
Slider గుంటూరు

డిసెంబర్ 17న 4వ తుగ్లక్ డే పాటిద్దాం

#tuglakday

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు

సర్వరోగాలకూ తెల్ల మాత్ర మందు అన్న చందంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాల కల్పన, పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి వంటి అన్ని అంశాలను కోల్పోవటానికి, ఐదేళ్ళ వైకాపా పాలనలో రాష్ట్రాన్ని 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లటానికి ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల మూర్ఖపు ప్రకటనే కారణమని, డిసెంబర్ 17వ తేదీని 4వ తుగ్లక్ డే గా రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలు పాటిస్తూ , వివిధ పోరాట రూపాలతో నిరసనలు తెలపాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు నిచ్చారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 డిసెంబరు 17వ తేదీన అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన మూడు ముక్కల ప్రకటన వినగానే భూములు ఇచ్చిన రైతుల గుండెల్లో గునపాలు దిగాయని, మూడు ప్రాంతాల ప్రజలు నిశ్చేష్టులై నివ్వెర పోయారన్నారు. వైకాపా ప్రభుత్వం శైశవ దశలోనే ఉన్న అమరావతి బాలుడిని వడ్ల గింజ వేసి హత్య చేసేందుకు ఎన్నో కుట్రలు చేసిందన్నారు.

రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులని, వ్యాపారులని, స్వార్ధపరులని, కమ్మ కులం మాత్రమే అని పేర్లు పెట్టిందని , రాజధాని ప్రాంతాన్ని స్మశానం, ఎడారి, వరదలు వస్తాయి అంటూ నిందలు వేశారన్నారు. ఆఖరికి అమరావతి ఉద్యమాన్ని నీరుకార్చేందుకు, అణచి వేసేందుకు పోలీసు పదఘట్టనలతో పల్లెలను కల్లోలిత గ్రామాలుగా మార్చారన్నారు. అయినా రాజధాని మహిళలు వెన్ను చూపకుండా, న్యాయం కోసం, ధర్మం కోసం తెగించి పోరాడారని కొనియాడారు.

పదిహేను వందల రోజుల ఉద్యమ శిబిరాలతో పాటు, దేవస్థానం, అరసవల్లి పాదయాత్రల ద్వారా మూడు ప్రాంతాల ప్రజల మద్దతు పొందారన్నారు. అమరావతికి హైకోర్టు, సుప్రీంకోర్టు అండగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం పలుమార్లు రాజ్యసభ, లోక్ సభల్లో ఏపీ రాజధాని అమరావతి అని చెప్తున్నా, వైసీపీ ప్రభుత్వం వినటం లేదన్నారు. రాజధానికి రావలసిన పలు సంస్థలను, పరిశ్రమలను అడ్డుకోవటం ద్వారా, 50 లక్షల కోట్ల రాజధాని ఆస్థిని అడవిని చేయడం ద్వారా రాష్ట్రం ఎంతో కోల్పోయిందన్నారు.

ఇప్పటికీ ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ రుషికొండకు పోతాం అని ప్రకటనలు చేయటం శిశుపాలుడి వైఖరికి నిదర్శనంగా అభివర్ణించారు. న్యాయ స్థానాలలో మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకున్నట్లుగా చెబుతూ, ప్రజలకు మాత్రం మూడు రాజధానులు ఉన్నాయి అంటూ రెండు నాలుకల అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. డిసెంబర్ 17వ తేదీన రాజధాని రైతులతో పాటు బహుజన జెఎసి తుళ్ళూరులో నిరసన సభ నిర్వహించ బోతున్నట్లు తెలిపారు. 17వ తేదీన రాజధాని మహిళలు, రాష్ట్ర ప్రజలు 4వ తుగ్లక్ డేని వివిధ నిరసనల రూపాలతో పాటించాలని బాలకోటయ్య పిలుపునిచ్చారు.

Related posts

ఆదర్శం: విద్యార్ధుల్ని దత్తత తీసుకున్న తెలుగుదేశం నేతలు

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు

Satyam NEWS

గర్భాశయ క్యాన్సర్ కు తొలి దేశీయ వ్యాక్సిన్ సిద్ధం

Satyam NEWS

Leave a Comment