32.2 C
Hyderabad
May 2, 2024 02: 58 AM
Slider ప్రత్యేకం

విశాఖపట్నం రాజధాని కాదు: కేంద్రం స్పష్టీకరణ

#raghuramakrishnamraju

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిత్వ శాఖ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నంగా పేర్కొనడంపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు రాసిన లేఖపై తక్షణ స్పందన వెలువడింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై న్యాయ వివాదం నడుస్తుండగా కేంద్రం ఆ విధంగా ఎలా చెబుతుందని రఘురామకృష్ణంరాజు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. ఈ లేఖకు వివరణ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్రోలు ధరలు ఏ నగరంలో ఎంత ఉన్నాయో చెబుతూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిందని, అయితే అందులో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అని పేర్కొనడం తప్పేనని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.

పెట్రోలు ధరలు ఏ విధంగా ఉన్నాయో చెప్పేందుకు విశాఖపట్నం ఒక నగరం గానే తమ సమాధానంలో భావించాలని, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కాదని వారు వివరణ ఇచ్చారు. లోక్ సభ సభ్యులు కుంభకూడి సుధాకరన్, ప్రద్యూత్ బర్దులోయీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పెట్రోధరలు ఏ నగరంలో ఎంత ఉన్నాయి అనే అనుబంధం అందులో ఉంచారు.

ఈ అనుబంధంలో విశాఖపట్నం అని సూచిస్తూ దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేర్కొన్నారు. దీనిపై రఘురామకృష్ణంరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిపై న్యాయ వివాదం ఉందని, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధనకు సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు నడుస్తుండగా కేంద్రం ప్రభుత్వం ఈ విధంగా విశాఖ ను రాజధానిగా పేర్కొనడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. విశాఖపట్నం ను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కాకుండా ఒక నగరంగా మాత్రమే చూడాలని కేంద్రం స్పష్టం చేసింది.  

ఇదే విషయాన్ని లోక్ సభ సచివాలయానికి కూడా స్పష్టం చేశామని, ఈ మేరకు సవరణ ను కూడా లోక్ సభ కు పంపామని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.

Related posts

మామిడిపల్లి కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిక

Sub Editor

ఇవేం ఎన్నికలు? :వాట్స్ యాప్ లో బ్యాలెట్ పేపర్లు

Satyam NEWS

ఘనంగా చాదర్ ఘాట్ రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం

Satyam NEWS

Leave a Comment