29.7 C
Hyderabad
April 18, 2024 04: 32 AM
Slider సంపాదకీయం

షర్మిల టార్గెట్ ఆస్తులా? ఓట్లా?

#Sharmila

వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిలా రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంతో దూకుడుగా వెళుతున్నారు. ఆమె అన్నయ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రెడ్డి తనకు ఆస్తులలో వాటా ఇవ్వనందువల్ల వైఎస్ షర్మిలా రెడ్డి కోపంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఆమె టార్గెట్ ఏమిటి? అన్న ఇవ్వను అని మొండికేసిన ఆస్తులను మళ్లీ చేజిక్కించుకోవడమా? లేక కాంగ్రెస్ కు ఓట్ బ్యాంకును సంపాదించి పెట్టడమా?

ఇదే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వై ఎస్ షర్మిలా రెడ్డి తన మొదటి టార్గెట్ ను డిసైడ్ చేసుకున్నారని అంటున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా ప్రభావవంతమైన పార్టీగా గుర్తించేలా ఓటు బ్యాంక్ తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఈ విషయంలో ఆమె చాలా స్పష్టతతోనే రాజకీయాలు చేస్తున్నారని తొలి ప్రసంగం చూస్తేనే అర్థమవుతుందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఆదరించి ముస్లిం, దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు షర్మిల మొదటి స్పీచ్ లోనే ప్రయత్నాలు చేశారు. టీడీపీ, వైసీపీ రెండూ  బీజేపీకి దగ్గరని చెప్పడమే కాకుండా మణిపూర్ చర్చిలపై జరిగిన దాడుల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు.

ఈ కారణంగానే వైఎస్ఆర్‌సీపీ ఉలిక్కి పడిందని అర్థం చేసుకోవచ్చు. పది శాతానికి పైగా ఓట్లను సాధించుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ట్రాక్‌లోకి వచ్చినట్లే. అంతే కాదు షర్మిల నాయకత్వం బలంగా మారుతుంది. అందుకు బాగా దగ్గరగా ఉండే దారి ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లను ఆకర్షించడం. సీఎం జగన్ సొంత పార్టీ పెట్టుకునే వరకూ ఏపీలో ముస్లిం, దళిత వర్గాలన్నీ కాంగ్రెస్ ను అంటి పెట్టుకుని ఉన్నాయి. తర్వాత పూర్తిగా  వైసీపీ వైపు మళ్లాయి.

ఇప్పుడు ఆ ఓటర్లను వెనక్కి రప్పించుకోవడం సులువు అన్న ఉద్దేశంతో షర్మిల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె  ఈ రెండు వర్గాలకు కాంగ్రెస్ మాత్రమే రక్ష అన్నట్లుగా ప్రసగించారు. సీఎం జగన్  స్వయంగా క్రైస్తవుడు అయినప్పటికీ ఆయన మణిపూర్ లో చర్చిలపై జరిగిన దాడుల్ని ఖండించలేదని  విమర్శించి సంచలనం రేపారు.

నిజానికి మణిపూర్ అంశం ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చకు  రాలేదు. కానీ సీఎం జగన్ ను టార్గెట్ చేయడానికి షర్మిల ఈ ప్రస్తావన తీసుకు వచ్చారు. అంతే కాదు. మైనార్టీ వర్గాలను ఆకట్టుకునేందుకు బీజేపీ కి టీడీపీ, వైసీపీ రెండు భయపడుతున్నాయని,  ఆ పార్టీకి తొత్తులేనని  విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. బీజేపీని వ్యతిరేకించే క్రిస్టియన్, ముస్లిం వర్గాలకు  మరో చాయిస్ లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు బీజేపీతో సన్నిహితంగా ఉంటాయి. టీడీపీ, జనసేన కూటమిగా ఉండటమే కాదు. బీజేపీతో కలుస్తాయన్నంతగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇక వైసీపీ సంగతి చెప్పాల్సిన పని లేదు. ప్రతీ సందర్భంలోనూ బీజేపీకి  మద్దతుగానే ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి.

అందుకే సంప్రదాయంగా తాము ఎవరికి ఓటు వేస్తామో వారి వైపు చూస్తున్నారు దళిత, ముస్లిం వర్గాలు. అయితే వారిలో అసంతృప్తి ఉందని షర్మిల గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగానే అందర్నీ టార్గెట్ చేయడమే కాకుండా తమ విధానాలను స్పష్టంగా చెప్పి  వారిని మళ్లీ తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నారు.  మణిపూర్ చర్చిల అంశాన్ని ప్రస్తావించడం, బీజేపీతో రెండు పార్టీలు అంట కాగుతున్నాయని చెప్పడం ద్వారా షర్మిల లోతైన  రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని గట్టిగాభావిస్తున్నారు.

షర్మిల రాజకీయం ఇంత సూటిగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మొదట ఊహించలేదు. కానీ ఆమె  బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎదురుదాడి చేయడంతో ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే వైసీపీ నేతలు  కౌంటర్లు ఇవ్వకపోతే తమ ఓటు బ్యాంకుకే ఎక్కువ నష్టం జరుగుతుందన్న అంచనాలతో  రంగంలోకి  దిగిపోయారు. ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు.

ఆమె చంద్రబాబుకు మేలు చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఇతర నేతలు షర్మిలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. ఓట్లు చీల్చి చంద్రబాబుకు మేలు చేసేందుకే షర్మిల రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే ఆమె విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ మత ప్రచారకుడు. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం చర్చిల పాస్టర్లను  ప్రభావితం చేసేవారు. చర్చిల ద్వారా జగన్ కు దళితుల్ని బలమైన ఓటు బ్యాంకుగా  మార్చారన్న అబిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు ఆ ఓట్లు చీలిపోతే వైసీపీ నష్టపోతుంది.

షర్మిల కారణంగా రెండు, మూడు శాతం ఓట్లు చీలినా వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న  అభిప్రాయం ఉంది. ఎందుకంటే షర్మిల టార్గెట్  చేస్తున్న ఓటు  బ్యాంక్ పూర్తిగా వైసీపీదే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైనా  షర్మిల వైపు మొగ్గినా ఆ ఓట్లు కూడా వైసీపీవే.

అందుకే షర్మిలను వైసీపీ తేలికగా తీసుకునే అవకాశం లేదు. గతంలో ప్రజారాజ్యం పార్టీ, లోక్ సత్తా పార్టీలు ఒకే సారి ఎన్నికల బరిలోకి దిగడంతో  వైఎస్ఆర్  రెండో సారి కాంగ్రెస్ ను సునాయసంగా గెలిపించగలిగారు. ఈ రెండు పార్టీలు  పెద్ద ఎత్తున ఓట్లు చీల్చాయి. ఆ ఓట్లు చీలక  పోతే 1999లో కాంగ్రెస్ గెలిచేది కాదన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థిని తాము ఎదుర్కొనే పరిస్థితి ఉందని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది.

Related posts

చదువుకు పేదరికం అడ్డుకాకూడదు: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

ఇక అఖిల్ తో పూజా హెగ్డే ఆటా పాటా

Satyam NEWS

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మాగుంట

Bhavani

Leave a Comment