33.7 C
Hyderabad
April 29, 2024 00: 13 AM
Slider ప్రకాశం

గిద్దలూరు ఎమ్మెల్యేను ఏం చేయాలి…..?

#jagan

గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఏం చేయాలి? ఈ ప్రశ్న అధికార వైసీపీ పెద్దలకు కొరుకుడుపడని సమస్యగా మారింది. ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిపై తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీటీడీకి అధికారిగా ధర్మారెడ్డి ఉన్నా బోర్డు చైర్మన్ గా ముఖ్యమంత్రి జగన్ చిన్నాయన వై వీ సుబ్బారెడ్డి ఉన్నారు.

సుబ్బారెడ్డికి చెప్పకుండా ధర్మారెడ్డి ఏం చేసే అవకాశం లేదు. అంటే ధర్మారెడ్డిపై ఆరోపణలు చేయడమంటే సుబ్బారెడ్డిపై ఆరోపణలు చేసినట్లే. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నియమించే టీటీడీ బోర్డుపైనా, అందులోని ముఖ్య అధికారులపైనా ఆరోపణలు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించినట్లే. ఈ అన్నింటిని ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేశారు.

ఆరోపణలు చేయడం కూడా ఎవరో ప్రతిపక్ష నాయకుడు చేసినంత తీవ్రంగా ఉంది. ధర్మారెడ్డిపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తాననని రాంబాబు చెప్పారు. అయితే రాంబాబు సీఎం ను కలిసే లోపునే ధర్మారెడ్డి, సుబ్బారెడ్డిలు కలిసి జగన్ మోహన్ రెడ్డికి అన్నా రాంబాబుపై ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకూ టీటీడీపై ఏ ఎమ్మెల్యే కూడా విమర్శలు చేయలేదు. అలాంటిది అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి తీవ్రమైన ఆరోపణలు చేయడమంటే అది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమేనని సుబ్బారెడ్డి భావిస్తున్నారని తెలిసింది.

ఉమ్మడి ఒంగోలు జిల్లాకు చెందిన అన్నా రాంబాబు, సుబ్బారెడ్డిల మధ్య ఆది నుంచి రాజకీయ విభేదాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి నేపధ్యంలో అన్నా రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని సుబ్బారెడ్డి ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. మరో ఎమ్మెల్యేపై కూడా చర్య తీసుకోవడం ఎలా అని జగన్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోతే రేపటి నుంచి మరింత మంది ఎమ్మెల్యేలు టీటీడీని లక్ష్యంగా చేసుకుంటారనే భయం కూడా ఉంది. అందులోనూ ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి సాక్ష్యాత్తూ సుబ్బారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న టీటీడీపైనే విమర్శలు చేస్తే ఇక ఆ జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలను అదుపు చేయడం సుబ్బారెడ్డికి కష్టం అవుతుంది. అందుకోసం అన్నా రాంబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని సుబ్బారెడ్డి పట్టుపడుతున్నట్లు తెలిసింది. చివరకు ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

Related posts

సిక్స్ మినిట్ షాట్ సింగిల్ టేక్ లో!!

Satyam NEWS

పాటపై దాడి చేయడం అప్రజాస్వామికం

Bhavani

క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్న విజయనగరం పోలీసులు

Satyam NEWS

Leave a Comment