28.7 C
Hyderabad
April 27, 2024 04: 40 AM
Slider సంపాదకీయం

పక్కలో బల్లెం: రఘురామకు తోడు మరో ఇద్దరు

#raghurama

ఎంతో పటిష్టంగా ఉన్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ తిరుగుబాటుదారులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నది? పార్టీపై తొలి తిరుగుబాటు బావుటా ఎగరేసిన నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజుపై పార్టీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. పార్టీని ప్రతి రోజూ ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్న రఘురామకృష్ణంరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం వైసీపీకి లేకుండా పోయింది. ఒక్క ఏడాది కాలం మాత్రమే పార్టీతో సజావుగా సాగిన రఘురామకృష్ణంరాజు అనుబంధం ఆ తర్వాత తెగిపోయింది.

అలాంటి రఘురామకృష్ణంరాజును పోలీసు కేసులతో వేధించారు తప్ప పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. రఘురామకృష్ణంరాజు గత రెండు సంవత్సరాలుగా దాదాపు ప్రతి రోజూ క్రమం తప్పకుండా ప్రభుత్వ చర్యలను ఎండగడుతూనే ఉన్నారు. ఆయన పెడుతున్న మీడియా సమావేశాలు ప్రతి రోజూ ట్రెండింగ్ అవుతునే ఉన్నాయి. అలాంటి రఘురామకృష్ణంరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేసే సాహసం ఇప్పటి వరకూ వైసీపీ చేయలేకపోయింది.

ఇప్పుడు రఘురామకృష్ణంరాజుకు తోడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తయారయ్యారు. వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు అయిన ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని గత కొద్ది రోజులుగా విమర్శిస్తూనే ఉన్నారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగాలి అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలకు వెళితే ముందుగానే ఇంటికిపోవడం ఖాయం అని కూడా ఆయన జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఆనం రామరామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఆనం రామనారాయణ రెడ్డికి ఉన్న విశ్వసనీయతతో ఆయన మాటలను చాలా మంది నమ్మారు కూడా. జగన్ పార్టీకి ఆనం రామనారాయణ రెడ్డి మాటలు ఎంతో నష్టం చేకూర్చాయి. రఘురామకృష్ణంరాజు ఇంత కాలం చెబుతున్న మాటలు కరెక్టే అనే అప్పుడు నమ్మని వారు కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితి వచ్చింది.

ఆనం రామనారాయణ రెడ్డితో బాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన తిరుగుబాటు వైసీపీ వెన్నులో వణుకు పుట్టించింది. రెడ్డి కులస్తులే జగన్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని ఎవరూ ఊహించలేదు. అలాంటిది రెడ్డి కులస్తులే తిరుగుబాటు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. మంత్రి వర్గంలో స్థానం లభించనప్పుడు కూడా రెడ్డి కులస్తులే తిరుగుబాటు చేశారు.

ఇప్పుడు కూడా రెడ్డి కులస్తులే జగన్ రెడ్డి పనితీరును విమర్శించడం చర్చనీయాంశం అయింది. ఆనం రామనారాయణ రెడ్డిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే జగన్ మోహన్ రెడ్డి ధైర్యాన్ని అందరూ మెచ్చుకుని ఉండేవారు. రఘురామకృష్ణంరాజు తో కలిసి ముగ్గుర్నీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే జగన్ మోహన్ రెడ్డి ఇమేజి పెరుగుతుంది. అయితే ఆయన అలా చేయడం లేదు. రఘురామకృష్ణంరాజును నియోజకవర్గంలో తిరగనీయకుండా చేయడం, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు షాడో లను నియమించడం చేస్తున్నారు.

ఎంతో పటిష్టంగా ఉన్న పార్టీ ఇలా పరోక్ష చర్యలు తీసుకోవడం మంచిది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డికి అయితే భద్రత తగ్గించడం, శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడం లాంటి చర్యలతో వైసీపీపై ప్రజల అనుమానాలు మరింత బలపడేలా చేస్తున్నాయి. ఇంత కాలం రఘురామకృష్ణంరాజు వంటరి పోరాటం చేశారు. ఇప్పుడు మరో ఇద్దరు కూడా అదే బాటలో చేరారు.

పార్టీ పరంగా వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వైసీపీ బలహీనతలను వ్యక్తం చేస్తున్నదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. రఘురామకృష్ణంరాజు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం ప్రారంభించిన మొదట్లో వైసీపీ సోషల్ మీడియా ఆయనను అత్యంత దారుణంగా, అత్యంత హేయమైన పదజాలంతో విమర్శించేది. బూతులతో ఆయనకు సమాధానం చెప్పేవారు.

ఒక సినీ నటిని ఆయనపై ప్రయోగించి సభ్య సమాజం చర్చించుకోలేని విధంగా కామెంట్లు చేయించే వారు. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డిపైనా, శ్రీధర్ రెడ్డి పైనా వైసీపీ సోషల్ మీడియా వ్యాఖ్యానాలు మొదలు పెట్టింది కానీ ప్రజలలోకి వెళ్లడం లేదు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపైనా అవాకులు చవాకులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూనే ఉన్నారు కానీ ఎవరూ స్పందించడం లేదు. జరుగుతున్న మార్పులతో రాజకీయ పరిస్థితి ఎలా ఉందనే విషయం చెప్పకుండానే వెల్లడి అవుతున్నది.

Related posts

ఎక్స్ ప్రెస్ టైన్ కు తప్పిన ప్రమాదం

Satyam NEWS

ఎస్వీబీసీ ఛానల్ పై సమీక్ష

Murali Krishna

మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment