40.2 C
Hyderabad
April 29, 2024 15: 16 PM
Slider సంపాదకీయం

సొంత జిల్లా కడపలో జగన్ రెడ్డికి ఎదురు గాలి

#jaganmohan

కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు జగన్ హయంలో వైసీపీకి  కడప జిల్లానే వాళ్ళ రాజకీయాలకు అతి పెద్ద ప్లస్ పాయింట్. ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి తిరుగులేదన్నది నిన్నటి వరకూ రాజకీయాలలో వినిపించే మాట. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో వైసీపీ పతనం ప్రారంభం అయింది.

వైసీపీ సహా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు జరిపిన సంగతి తెలిసిందే. ఆయా సర్వేలలో కడప జిల్లా ప్రజల నుండి ఆసక్తికర అభిప్రాయాలు బయటపడుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ సొంతంగా నిర్వహించుకున్న సర్వేలు, వైసీపీ తరపున నిర్వహించిన సర్వేలలో కూడా ప్రజల నుండి వ్యతిరేక అభిప్రాయాలు బయటపడగా అవేవీ బయటకి రాకుండా చూసుకున్నట్లు తెలుస్తోంది.

వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన కడప జిల్లాలో ఈసారి వైసీపీకి ఊహించని షాక్ తప్పదనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నది. ఉమ్మ‌డి క‌డ‌ప‌ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజ‌క‌ వ‌ర్గాలు ఉండగా రాజంపేట, కడప పార్లమెంట్ పార్ల‌మెంటు స్థానాలు కూడా ఉన్నాయి. వైసీపీ ఆవిర్భవించిన అనంతరం జరిగిన 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ పదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. ఒక్క రాజంపేటలో హవా చూపించలేకపోయింది.

ఆ తర్వాత 2019లో రాజంపేట స‌హా మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ స్థానాలు దక్కించుకొని క్లీన్ స్వీప్ చేసింది. ఆ రెండు ఎన్నికలలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై సానుభూతితో పాటు వైఎస్ కుటుంబం మొత్తం ఏకతాటిపై నిలబడి జగన్ రెడ్డిని సీఎంని చేయాలని అన్ని నియోజకవర్గాలకు తిరిగారు. 2019 ఎన్నికలలో  వివేకానంద రెడ్డి హత్య, కోడికత్తి దాడి, జగన్ ఒక్క ఛాన్స్ అభ్యర్థన అన్నీ కలిసి వచ్చి క్లీన్ స్వీప్ చేయగలిగింది.

అయితే, ఆ హ‌వా  కడప జిల్లాలో ప్రస్తుతం క‌నిపించ‌డం లేదు. ఈసారి ఇక్కడ వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం అసాధ్యమే కాకుండా గతంలో ఎన్నడూ లేనంతగా ఇక్కడ ప్రజలు వైసీపీకి వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. దీనికి మొత్తంగా నాలుగైదు కార‌ణాలు చెబుతున్నారు. వైసీపీకి వ్యతిరేక పవనాలలో కీలకమైనది కుటుంబంలో వివాదాలు. జగన్మోహన్ రెడ్డి నుండి తల్లి విజయమ్మ, సోదరి షర్మిల దూరమవడం, మరో సోదరి సునీత సొంత కుటుంబంపైనే న్యాయ పోరాటం చేయడం.. ఈ కారణాలతో  వైఎస్ హార్డ్ కొర్ అభిమానులు జగన్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయానికి విజయమ్మ కనీసం ఒకటి రెండు నియోజకవర్గాలలో ప్రచారం చేయకపోతే ఈ నష్టం తీవ్రత ఊహకు అందనంతగా   ఉండే అవకాశం ఉంది.

వైసీపీ వ్యతిరేక గాలి వీయడం వెనక మరో బలమైన కారణం వివేకా హత్య. గత ఎన్నికల సమయంలో ఈ హత్య వైసీపీకి చేసిన మేలు అంతా ఇంతా కాదు. అసలే తండ్రి లేని కుమారుడు, కక్ష పూరితంగా జైల్లో పెట్టారనే సానుభూతికి తోడు అండగా ఉంటాడుకున్న చిన్నాన్నను కూడా లేకుండా చేశారనే సానుభూతి బాగా వర్క్ అవుట్ అయింది. అయితే ప్రస్తుతం  ఆ కుట్ర సొంత వాళ్ళ పనే అనే అనుమానాలు బలపడ్డాయి.

దీంతో ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత తలెత్తే ఛాన్స్ ఉంది. రాయలసీమకి న్యాయరాజధాని తెస్తానని ఊరించడం.. ఇదిగో వస్తుంది.. మాట తప్పం మడం తిప్పం అంటూనే కాలం గడిపేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అన్నిటికీ మించి స్థానిక ప్ర‌జ‌ల డిమాండ్‌ను ప‌రిష్క‌రించ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు ఘోరంగా విఫలమైంది. అదే సమయంలో వైసీపీ నేతల మధ్య సఖ్యత కొరవై రచ్చకెక్కడం ప్రజలలో ఏహ్యభావన కలిగిస్తోంది.

అదే క్రమంలో ప్రతిపక్ష టీడీపీ ఇక్కడ బలం పుంజుకున్నది. ఇటీవల పొద్దుటూరు భారీ ఎత్తున వైకాపా శ్రేణులు అమరావతి వచ్చి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకోడం చూస్తే కడప జిల్లాల్లో వైయస్ కుటుంబ కోటలకు బీటలు వారుతున్నాయనడానికి నిదర్శనం. దీంతో ఇప్పుడు మొత్తంగా కడప జిల్లాలో ఈసారి సగానికి సగం స్థానాలను వైసీపీ చేజార్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related posts

ఇంటర్ నెట్ షట్ డౌన్ లో ప్రపంచంలోనే మనమే నెంబర్ వన్

Satyam NEWS

శ్రీకాకుళంలో రెచ్చిపోతున్న ఇసుక బకాసురులు

Satyam NEWS

అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల అరెస్టు  ఖాయం

Satyam NEWS

Leave a Comment