28.7 C
Hyderabad
April 27, 2024 05: 33 AM
Slider ప్రత్యేకం

విశాఖ పారిశ్రామిక సదస్సు: అన్ని అబద్ధాలకు వేదిక

#raghurama

రాష్ట్రంలో రెండెంకల అభివృద్ధి ని సాధించామని ప్రభుత్వ పెద్దలు చెప్పేదంతా శుద్ధ అబద్ధం. గతంలో జరిగిన అభివృద్ధి వల్ల, ఇప్పుడు దేశంలోని కొన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం మెరుగైన  స్థానంలో ఉన్నదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.  రాష్ట్రంలో సహజ వనరులకు కొదవలేదు. అద్భుతమైన తీర ప్రాంతం ఉంది. జాతీయ రహదారుల వసతి భేష్ గా ఉందని, పెట్టుబడులకు అనువైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన వ్యాఖ్యానించారు.

జాతీయ రహదారులు అద్భుతంగా ఉన్నప్పటికీ, గ్రామాలలో రోడ్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయి.  ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టకముందే, రాష్ట్రంలో  మౌలిక రోడ్ల అభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో సహజ వనరులకు తో పాటు, మేధో సంపత్తి కలిగిన, నైపుణ్యమైన పనివారికి కొదవలేదు. గతంలో ఎంతో అభివృద్ధి చెందడం వల్లే, రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుంచి దరిద్రమైన పాలన కొనసాగుతున్నప్పటికీ, అంకెల్లో అభివృద్ధిలో పర్వాలేదనే పరిస్థితి నెలకొందన్నారు.

శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… విశాఖలో జరుగుతున్న పారిశ్రామిక సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలను చేసుకొనునట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని, అందులో 10 శాతం పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చిన ఆనందమేనని అన్నారు.  ఐటి ఎగుమతుల గురించి ఆహా… ఓహో  అని పాలకపక్షం చెబుతున్నప్పటికీ, అంత సీన్ ఏమీ లేదని కేవలం 150 కోట్ల ఎగుమతులు మాత్రమే జరిగాయి .

పాలక పక్షం చెప్పే లెక్కలకు, వాస్తవాలకు ఎక్కడ పొంతన లేదు.  రాష్ట్రంలో ఇతర పరిశ్రమల ఏర్పాటుకు  మంచి అవకాశాలు ఉన్న మాట నిజమే. అయితే ఇప్పటివరకూ, ప్రభుత్వం చేసిందేమీ లేదు. పరిశ్రమల స్థాపనకు కృషి చేయకపోతే పుట్టగతులు ఉండవని గ్రహించినట్టుంది. ఈ జ్ఞానం ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషమే కానీ, ఇది నిజమా… నటన  అన్నది తెలియాల్సి ఉందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

కియా విస్తరణను అడ్డుకున్నది ఎవరు?

గత ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్ కార్ల కంపెనీ విస్తరణ  అడ్డుకున్నది ఎవరని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. కియా కంపెనీ ఏర్పాటుపై అప్పట్లో విజయసాయిరెడ్డి  అడ్డగోలు ట్విట్లు చేయగా, మగధీరుడు అయిన ఒక ఎంపీ కియా కంపెనీ పై మాటలు చేసుకొని ఇబ్బందులు పెట్టడం  వల్లే, వారు విస్తరణను నిలిపి వేసిన  మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. 

విశాఖలో  హుండాయ్, పోస్కో కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, కడపకు వెళ్లాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వారు ఏకంగా  కోరియాకే వెళ్లిపోయారన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడపకు చేసిందేమీ లేదు. పులివెందులలో ఫిష్ మార్ట్ ఏర్పాటు మినహా అని విమర్శించారు.  ప్రభుత్వమే చేపల దుకాణం, మాంసం దుకాణాలను ఏర్పాటు చేయాలన్న చెత్త ఆలోచనల నుంచి బయటకు వచ్చి, పారిశ్రామికవేత్తల సదస్సును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అభినందనీయమని  రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో  పరిశ్రమలు ఏర్పాటు చేస్తే, వాటాలు అడుగుతున్నారన్న ప్రచారం దేశవ్యాప్తంగా జరగడంతో, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు  ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదని తెలిసింది. రాష్ట్రంలో పరిశ్రమల  స్థాపనకు పెట్టుబడులను పెట్టే వారికి ముందు మౌలిక వసతులు కల్పించాలి. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను వాటాల కోసం ప్రభుత్వ పెద్దల నుంచి మొదలుకొని, స్థానిక ఎమ్మెల్యేలు, చోటా మోటా  నాయకుల వరకు పీక్కు తింటామంటే… పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్కరూ  ఆసక్తి చూపరని తెలిపారు.

కలల రాజధాని కల్లలే

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కలల రాజధాని కల్లలే అవుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.  ముఖ్యమంత్రి ఏ రోజు  ఏ ఊర్లో ఉంటాడో తెలియదు. రాష్ట్ర రాజధాని ఎక్కడో తెలియదు.  ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే, అదే రాష్ట్ర రాజధాని మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి వెంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా తిరిగితే, ఇక రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాలనుకునే  పారిశ్రామికవేత్తలు ఏ ఊరుకు వెళ్లి, ఎక్కడకనీ వెళ్లి ముఖ్యమంత్రిని కలవాలని ప్రశ్నించారు.

త్వరలోనే విశాఖపట్టణం నుంచి  పరిపాలన సాగిస్తానని ముఖ్యమంత్రి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.  విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి, రాష్ట్రంలో పెట్టుబడులకు అసలు పొంతన ఉందా? అని నిలదీశారు. రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. రాష్ట్ర హైకోర్టు, రాజధానిని మార్చడానికి వీలులేదని తీర్పును ఇచ్చింది. అయినా రాజధాని మార్పు గురించి, పదే పదే ముఖ్యమంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అయినా, విశాఖ పట్టణానికి తరలి వెళ్తానని ముఖ్యమంత్రి మాట్లాడడం పరిశీలిస్తే ఆయన మానసిక పరిస్థితిపై ఆందోళనగా ఉంది. 

జగన్ విశాఖపట్టణానికి మకాం మార్చుకోవచ్చు. కానీ రాజధానిగా అమరావతియే ఉంటుంది. విశాఖపట్నంలో సముద్ర తీరాన నిర్మించుకున్న ఇంట్లో కూర్చుని, సముద్ర తీర వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. రాష్ట్రంలో ఏదైనా నగరాన్ని అభివృద్ధి చేయాలంటే, అది రాజధాని నగరమే కావలసిన అవసరం లేదు. అమెరికా దేశంలో  వాషింగ్టన్ డిసి కంటే పెద్ద పెద్ద నగరాలు 10 ఉన్నాయని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

రాయలసీమలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేవారికి, విశాఖపట్నంలో రాజధాని ఉంటే ఏమిటి ప్రయోజనం. విశాఖపట్నం తో పాటు, విజయవాడలోనూ విమానాశ్రయం ఉందని గుర్తు చేశారు.

హుందాగా వ్యవహరించిన ప్రతిపక్షాలు

2017 లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విశాఖపట్నంలో  పారిశ్రామికవేత్తల సదస్సును నిర్వహిస్తుంటే, ప్రత్యేక హోదా సాధన కోసం  ఆనాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తానని నానా హంగామా చేశారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. ఇప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని, అలాగే విశాఖపట్టణానికి రైల్వే జోన్ కూడా కేటాయించలేదు.

ఇటీవల బడ్జెట్లో నామమాత్రపు నిధులను మాత్రమే కేటాయించారు. అయినా, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎంతో హుందాగా వ్యవహరించాయి. గతంలో మాదిరిగా  ర్యాలీలు నిర్వహిస్తామని హంగామా చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించడం అభినందనీయం. ఇక రాష్ట్రంలో రెండు రోజులపాటు పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు ఉంటారని, అందుకే ఈ ప్రభుత్వ అరాచకాలపై ఎటువంటి ట్విట్లు చేయనని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు.

స్థానికులకు ఉపాధి అవకాశాలపై ఎవరు వ్యతిరేకం కాదు

స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని పారిశ్రామిక వేత్తలు కూడా భావిస్తారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాటు పెట్టుబడులపై దృష్టి సారించకుండా, గాలికి వదిలేసింది. ముఖ్యమంత్రి ఈ విధానాలను తాను జాతీయ మీడియాతో మాట్లాడుతూ గతంలోనే ప్రశ్నించాను . స్థానికులకే  75 శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి గతంలో చేసిన ప్రకటనపై, అప్పటి ఐటీ పెట్టుబడుల శాఖ మంత్రి  గౌతంరెడ్డి తో కూడా తాను మాట్లాడానని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు.

పరిశ్రమల్లో  స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలు కూడా భావిస్తారు. స్థానికంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లభించనప్పుడే, ఇతర ప్రాంతాల  వారిని ఆహ్వానించి ఉద్యోగాలు ఇస్తారు. బయోటెక్నాలజీ  కంపెనీని ఏర్పాటు చేసినప్పుడు,  ఎమ్మెస్సీ సైన్స్  చదివి నైపుణ్యం కలిగిన వ్యక్తులకు మాత్రమే ఆ సంస్థలో ఉద్యోగాలను కల్పించగలరని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ప్రాంతాన్ని యూనిట్ గా కాకుండా, రాష్ట్రాన్ని యూనిట్ గా చూసే విశాల దృక్పథం కలిగి ఉండాలి.

తన ఊరు తన తాలూకా అనే భావ దారిద్రం మంచిది కాదు. కేవలం ఎన్నికల్లో ఓట్లను ఆకర్షించడానికి తప్ప, ఈ విధానం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైనది కాదు. గత ప్రభుత్వ, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో  ఆదిత్య బిర్లా, మద్రాస్ సిమెంట్ కంపెనీలు  ప్రారంభమై పూర్తయ్యాయని, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో ప్రారంభమై,  పూర్తయింది లేదన్నారు. గత ఏడాది ముఖ్య మంత్రి దావోస్ కు వెళ్లి, అక్కడ నష్టాలలో ఉన్న బైజుస్ అనే కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

ఇక్కడి నుంచే కొంతమందిని తీసుకువెళ్లి, అక్కడ ఒప్పందాలు చేసుకోవడం విడ్డూరమని రఘురామకృష్ణం రాజు  విస్మయాన్ని వ్యక్తం చేశారు. విశాఖలో జరిగే పారిశ్రామికవేత్తల సదస్సుకు కుమార మంగళం బిర్లా  హాజరవుతారని చెప్పారని, కానీ ఆయన హాజరు కాలేదు . అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరవుతారన్న ఆయన కూడా హాజరు కాలేదు. 

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ హాజరు అయినప్పటికీ, ఆయన రాష్ట్రంలో పెట్టే పెట్టుబడుల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హమని పేర్కొన్నారు. గతంలో తిరుపతిలో ఏర్పాటు చేస్తానని చెప్పిన ప్రాజెక్టునే ఆయన వదిలివేశారు. తన సన్నిహితుడైన  పరిమల్ నత్వానికి రాజ్యసభ స్థానాన్ని తమ పార్టీ కట్టబెట్టిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. ఆంధ్రాలో పండిన కూరగాయలను కొనుగోలు చేస్తామని  పేర్కొనడం మినహా, పెట్టుబడుల గురించి ముఖేష్ అంబానీ ప్రస్తావించకపోవడం పట్ల, ఆంధ్రాలో పండిన కూరగాయలను ఆంధ్రాలోనే కొనుగోలు చేయాలని , లేకపోతే గుజరాత్ లో కొనుగోలు చేస్తారా అంటూ అపహాస్యం చేశారు.

ఒక పెద్ద ఫంక్షన్ నిర్వహిస్తున్నప్పుడు  చందాలకు వెళ్తే ఓ ఐదు వేలు రాసుకో, పదివేలు రాసుకో అన్నట్లుగా… ఒకరు ఐదు వేలు,  పెట్టుబడులు పెడతామని చెప్పగా, నవీన్ జిందాల్  తాను పదివేల పెట్టుబడులు పెడతానని పేర్కొన్నారు. దానికి భిన్నంగా  ముఖ్యమంత్రి మాత్రం 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరుగుతాయని, తొలి రోజే 11 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలను కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. ఇక రెండవ రోజు మిగిలిన రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంటామని చెప్పారని  రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

షిరిడి సాయి, అరబిందో కంపెనీలను ఎందుకు ఆహ్వానించలేదు?

విశాఖలో నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తల పెట్టుబడుల సదస్సుకు కడపకు చెందిన షిరిడి సాయి కంపెనీ, అరబిందో కంపెనీలను ఎందుకు ఆహ్వానించలేదని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. నెల్లూరులో 60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు, పంపుడ్ హైడ్రో ప్రాజెక్టులతో కలుపుకొని  లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టే షిరిడి సాయి కన్సార్టియం ప్రతినిధులను, హైడ్రో పంపుడ్ ప్రాజెక్టు తో పాటు, కాకినాడ ఎస్ ఈ జెడ్  ను దక్కించుకున్న అరబిందో కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటనీ ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలను తరిమి వేసి, ఇతరులను ఆహ్వానించలనుకోవడం విడ్డూరం. విశాఖపట్నం పారిశ్రామికవేత్తల సదస్సు వేదిక పైన కూర్చున్న వారి కంటే, అమర్ రాజా బ్యాటరీస్  ఎంతో పెద్ద కంపెనీ. వారికి ఆహ్వానం పంపించారా?. ప్రతిపక్ష పార్టీ ఎంపీ కి చెందిన  కంపెనీ అని   వేధించడం సరికాదు. ఇప్పుడు అమర్ రాజా కంపెనీ  ఇతర రాష్ట్రాలలో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు సిద్ధమయ్యింది.

రాష్ట్రంలోని ఎన్నో కంపెనీలు తెలంగాణ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయాయి. అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ యాజమాని రాజగోపాల్ నాయుడు  ఎంతో నిబద్ధత  కలిగిన వ్యక్తి. ఆయన రాష్ట్ర పారిశ్రామిక  అభివృద్ధికి కట్టుబడి ఉన్నవారు. అటువంటి పారిశ్రామికవేత్తను ఇతర రాష్ట్రాలకు తరిమివేసింది ఎవరు? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలం

రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, సిమెంట్ కంపెనీలను విరివిగా స్థాపించవచ్చునని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తమ సిమెంటు కంపెనీకి పోటీగా ఉందని ఉద్దేశంతో పునీత్ దాల్మియా  కంపెనీకి  ప్రభుత్వ పెద్దలు నోటీసులు ఇచ్చారు. కోర్టును ఆశ్రయించి దాల్మియా కంపెనీ స్టే పొందింది. ఇప్పటికీ  ఆ కంపెనీ స్టే పైనే నడుస్తోంది. పునీత్ దాల్మియా కొత్త కంపెనీ పెడతారో లేదో కానీ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని  నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలకు సూచించారు.

రాష్ట్రంలో ఉన్న కంపెనీలు  ఎందుకు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని, రాష్ట్రంలో  పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తారు. సంకుచిత స్వభావం, రాజకీయ మనస్తత్వం మనలో కనిపిస్తే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులను పెట్టేందుకు ఆసక్తి చూపించరు.  రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. మద్రాస్, బెంగళూరు నగరాలకు చేరువగా ఉన్నందువల్ల, నీటి వినియోగం తక్కువగా ఉన్న  పరిశ్రమల ఏర్పాటుకు  ప్రభుత్వం ముందుండి ప్రోత్సహించాలని రఘురామ  కృష్ణంరాజు సూచించారు.

పెట్టుబడులకు ఇది అనువైన సమయమని, ప్రస్తుతం పరిశ్రమలను స్థాపించాలనుకునేవారు  పనులు ప్రారంభించే నాటికి ఈ ప్రభుత్వం మారిపోతుందని అనుకుంటున్నాను.  పారిశ్రామికవేత్తల సదస్సు  విజయవంతం కావాలని, పెద్ద ఎత్తున రాష్ట్రానికి  పెట్టుబడులు రావాలని  కోరుకుంటున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Related posts

పిలిచి మంత్రి పదవి ఇస్తే అన్యాయం చేశారు

Satyam NEWS

సీఎం సభ కోసం పంట వేయద్దని రైతులకు కొడాలి నాని ఆదేశాలు

Bhavani

కేసీఆర్ కు సవాల్: రైతుల దగా పై చర్చకు సిద్ధమా?

Sub Editor 2

Leave a Comment