కేవలం చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరముందన్నారు. హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన చెప్పారు. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరముందని తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్ దిశ హత్యోదంతంపై రాజ్య సభలో చర్చ జరుగుతోంది. దోషులను కఠినంగా శిక్షించాలని టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. కేసు విషయంలో జాప్యం లేకుండా త్వరగా నిర్ణయాలు రావాలన్నారు. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ అన్నారు. చట్టాలు చేయడం ద్వారా మాత్రమే పరిష్కారం కాదని, సమస్య మూలాల నుంచి తొలగించడానికి సమాజం నిలబడాలని చెప్పారు. అన్నాడీఎంకే ఎంపీ విజిల సత్యానంద్ మాట్లాడుతూ.. ‘దేశంలో చిన్నారులు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దిశను హత్య చేసిన నలుగురు నిందితులను డిసెంబరు 31లోపు శిక్షించాలి. మరణించేంత వరకు వారిని ఉరితీయాలి.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలి’ అని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు శిక్షలు వెంటనే అమలు చేయాలని ఎంపీ సుబ్బిరామిరెడ్డి అన్నారు. శిక్షలు వెంటనే అమలైతే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ఘటనపై సభలోని అన్ని పార్టీల నేతలు విచారం వ్యక్తం చేశారు. మరోవైపు లోక్‌సభలోను దిశ హత్యపై చర్చకు సభ్యులు పట్టుబట్టారు. దీంతో జీరో అవర్‌లో స్పీకర్ దీనిపై చర్చకు అనుమతిచ్చారు. మరోవైపు దిశఘటనపై దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ప్రజా, మహిళా, విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. నల్ల రిబ్బన్లతో వీరంతా ఆందోళన చేపట్టారు. నిందితులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జస్టిస్ ఫర్ దిశ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.