33.7 C
Hyderabad
April 28, 2024 23: 43 PM
Slider ప్రత్యేకం

ఇది 50 % కమిషన్ ప్రభుత్వం

#raghurama

రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస, రావణ పాలనను  సమిష్టిగా ఎదుర్కొందాం. రామలక్ష్మణుల మాదిరిగా తెలుగుదేశం , జనసేన పార్టీలు కలిసిపోయాయి. టిడిపి, జనసేన పార్టీలతో  బిజెపి కూడా కలిస్తే అద్భుతంగా ఉంటుంది. రామలక్ష్మణులకు  తోడుగా హనుమంతునివలే  తాను నడుచుకుంటాను. రాష్ట్రంలో  కొనసాగుతున్న రావణ పాలన ను త్వరలోనే తుదముట్టించడం ఖాయమని నరసాపురం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు  పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రతి పనికి 50% కమిషన్ల ను జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు చెల్లించవలసిందేనని ప్రజలే చెబుతున్నారు. మైనింగ్ లో 50% కమిషన్లు ఇవ్వకపోతే, ఆ పని కి అప్రూవల్ లభించడమే కష్టమని అంటున్నారు . ఆదివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… కర్ణాటక రాష్ట్రంలో 40% కమిషన్లు  తీసుకుంటున్నారనే ఆరోపణలలో నిజం ఉన్నదో లేదో భగవంతుడికే తెలియాలి.

అయినా, అక్కడి ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని  ఓడించారు. రాష్ట్రంలో ప్రతి పనికి  50% కమిషన్లు తీసుకుంటున్నారన్నది జగమెరిగిన సత్యమే. దీనితో రాష్ట్రం లో ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న  తమ పార్టీని ఓడించడంలో ఎటువంటి  తప్పు జరిగే అవకాశమే లేదని ఆయన ఖరాకండిగా  తేల్చి చెప్పారు. తనని గతంలో చిత్రహింసలకు గురి చేసిన వారిని విడిచి పెట్టేది లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక, నెగ్గిన పార్టీలోనే తాను ఉంటాను.

అప్పుడు ప్రజలకు నిజాలు  తెలియజేసి, వారిని గుడ్డలూడదీసి ప్రజలచేతే కొట్టిస్తాను. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడేళ్ల క్రితం తాను ఒక్కడినే  మాట్లాడే వాడిని. కానీ ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. లక్షలాదిమంది  ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా న్యాయస్థానంలో కొనసాగుతున్న కస్టోడియల్ టార్చర్ పిటిషన్ పై  ఎట్టకేలకు హైకోర్టు స్పందించి వివరాలను సేకరించాలని సిబిఐ ని ఆదేశించడం ఆనందంగా ఉంది. ఇది ఒక రకంగా తనకు  పుట్టినరోజు బహుమతి వంటిదేనని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

మంచి మాటలు చెప్పినందుకే నాపై కక్ష కట్టారు

పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, ప్రభుత్వానికి నాలుగు మంచి మాటలు చెప్పినందుకే తనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కక్ష కట్టారు. వెంకటేశ్వర స్వామి భూములను భక్తుల అనుమతి లేకుండా విక్రయించవద్దని చెప్పిన మాటలు  ఆయనకు నచ్చలేదు. లారీ ఇసుక ధరను ఏడు వేల నుంచి  12 వేల రూపాయలకు  పెంచితే గత ప్రభుత్వం పడిపోయింది. అటువంటిది లారీ ఇసుక ధర ను 35 నుంచి 40 వేల రూపాయలకు పెంచి విక్రయించడం  తప్పని చెప్పాను.

లారీ ఇసుక దొరకడమే  ఈ ప్రభుత్వ హయాంలో గగనం అయిపోయింది. తనకు తెలిసిన ఒక వైద్యుడి అవసర నిమిత్తం  ఇసుక కోసం తీవ్ర ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. లారీ ఇసుక ధరను అడ్డగోలుగా పెంచడానికి అప్పట్లో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కూడా  లేవనెత్తారు. అంతలోనే ఆయన సర్దుకున్నట్టుంది.  ఇసుక ధరల పెంపును ప్రశ్నించినందుకు, పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదని  ఇప్పటికీ ఉందో లేదో తెలియని క్రమశిక్షణ సంఘం పేరిట తనకు నోటీసులు ఇచ్చారు.

తాను ఆ నోటీసులను పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. దీనితో, తనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రత్యేక విమానం వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిశారు. తనపై అనర్హత పిటిషన్ ఇచ్చి వచ్చే నెలకు మూడేళ్లు అవుతుంది. తాను ఎక్కడ కూడా పార్టీ లైన్  దాటకుండా, పార్టీ ప్రయోజనాల కోసమే  మంచి మాటలు, సలహాలు,  సూచనలు  ఇచ్చాను. తనపై అనర్హత వేటు వేయించాలని ఎన్నో టక్కు టమారా సూట్ కేసు విద్యలను జగన్మోహన్ రెడ్డి  ప్రదర్శించారు.

అందరూ ఆయన సూట్ కేసు విద్యలకు పడిపోరు.  క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు తనకు ప్రత్యక్షంగా అభయం ఇవ్వకపోయినప్పటికీ, ఆ వెంకటేశ్వర స్వామి రూపంలో  తనని కాపాడే ప్రయత్నాన్ని చేశారని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు.

దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు లభించేది రాష్ట్రంలోనే…

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లభించని మద్యం బ్రాండ్లు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే లభిస్తాయి. ఆ మద్యం బ్రాండ్లలో రసాయనిక అవశేషాలు ఉన్నట్లుగా  ప్రధాన ప్రతిపక్ష పార్టీతో పాటు, తాను ల్యాబ్ లో  చేయించిన పరీక్షల్లో తేలింది. రసాయనిక అవశేషాలు ఉన్న మద్యం తాగి, మద్యపాన  ప్రియులు మృత్యువాత పడడం ఖాయం. నాసిరకమైన మద్యాన్ని ప్రజల చేత తాగించి వారిని చంపడం ఎందుకు?, చనిపోయిన వారి కుటుంబాలకు జగనన్న వితంతు దీవెన ఇవ్వడం ఎందుకు? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

గతంలో 50 రూపాయలకు లభించే నాణ్యమైన మద్యం సీసాకు, ఇప్పుడు 150 రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ, గతం లోని నాణ్యత మాత్రం కనిపించడం లేదు. గతంలో 150 రూపాయలకు లభించే  మద్యం సీసా ధరను  ఇప్పుడు 300 రూపాయలకు పెంచారు. మద్యం కొనుగోలు,  అమ్మ కాలన్నీ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి వచ్చిన ఒక జూనియర్ స్థాయి అధికారి వాసుదేవ రెడ్డి   కనుసన్నలలో కొనసాగుతున్నాయి.

ఒకవైపు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా అంటూ లావాదేవీలన్నీ ఆన్లైన్ లోనే కొనసాగించాలని చెబుతుంటే, మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏటా  30 నుంచి 40 వేల కోట్ల ఆదాయం కలిగిన మద్యం లావాదేవీలన్నింటి  నగదు రూపంలోనే కొనసాగించడం దారుణం. మద్యం తయారీకి అంతా ఒకే రకమైన సరుకును వాడుతూ, బాటిల్ లేబుల్స్ ను మాత్రం మార్చి వేరువేరు ధరలకు విక్రయిస్తున్నారు.

300 రూపాయల  సీసా మధ్యలో తక్కువగా  ఆదాయాన్ని కొట్టివేస్తూ, అదే వెయ్యి రూపాయల మద్యం సీసాలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రజల నుంచి తీసుకుంటున్నది ఎంత?, వారికి సంక్షేమ పథకాల రూపంలో బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా అందజేస్తున్నది ఎంత??, ఒక వైపు నాసిరకమైన మద్యాన్ని విక్రయిస్తూ  ప్రజల ప్రాణాలు తీసి, మరొకవైపు దీవెన రూపంలో  వచ్చే డబ్బులు ఎవరికీ కావాలని రఘురామకృష్ణంరాజు నిలదీశారు.

Related posts

10న జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం

Satyam NEWS

ములుగును సమ్మక్క సారలమ్మ జిల్లాగా పేరు మార్చాలి

Satyam NEWS

9న ఒంటిమిట్టలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

Satyam NEWS

Leave a Comment