37.2 C
Hyderabad
April 26, 2024 19: 49 PM
Slider ముఖ్యంశాలు

ఇప్పటికైనా పరీక్షలు రద్దు చేసి పిల్లల ప్రాణాలు కాపాడండి

#AP CM

సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన నేపథ్యంలో ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి ఇంటర్ మీడియట్ పరీక్షలను రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాజాగా ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

పట్టుదలకు పోయి పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని, పరీక్షలు రద్దు చేసి ప్రజా నాయకుడు అనిపెంచుకోవాలని ఆయన జగన్ మోహన్ రెడ్డికి హితవు పలికారు. పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు ముందుగానే చెప్పాలని రఘురామకృష్ణంరాజు నిన్ననే తన లేఖ ద్వారా కోరినా ముఖ్యమంత్రి వినలేదు. పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగానే ఉన్నామని సుప్రీంకోర్టుకు చెప్పారు. దాంతో రఘురామకృష్ణంరాజు మళ్లీ లేఖ రాశారు. లేఖ పూర్తి పాఠం ఇది:

ముఖ్యమంత్రి గారూ,

మీకు కావాల్సింది లభించనప్పుడు మీకు లభించేదాన్నే అనుభవం అంటారు. ఈ నానుడి మన ప్రభుత్వానికి చక్కగా అతికినట్లు సరిపోతుంది. మీ ఆలోచనలకు అందని విషయాలను ఎప్పటికప్పుడు న్యాయస్థానాలు గుర్తు చేస్తున్నందున ఈ విషయం నేను ప్రస్తావించక తప్పదు. 12వ తరగతి పరీక్షలను జులై చివరి వారంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయించాలనే మీ మంకుపట్టుపై తాజాగా సుప్రీంకోర్టు ఉతికిఆరేయడం చూసినప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం కనిపించింది.

12వ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గురువారం నాడు తాజాగా సుప్రీంకోర్టు నిశితంగా పరిశీలించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అసలు అఫిడవిట్ దాఖలు చేయడంలోనే రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపించలేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించిందని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. తరగతి గదికి 15 మంది విద్యార్ధులనే ఉంచి పరీక్షలు నిర్వహిస్తామని, కోవిడ్ రక్షణ ప్రోటోకాల్ ను తూచా తప్పకుండా పాటిస్తామని అఫిడవిట్ లో చెప్పడంపై సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం గమనించాల్సిన అంశం.

రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక్కో గదికి 15 మంది విద్యార్ధులతో పరీక్ష నిర్వహించాలంటే కనీసం 35000 పరీక్షా గదులు ఉండాలని సుప్రీంకోర్టు లెక్కవేసింది. ఇలా ఇంత భారీ సంఖ్యలో తరగతి గదులు ఉన్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

కరోనా మూడో దశ ప్రారంభమౌతుందని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉన్న ఈ స్థితిలో జులై చివరి వారంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అదీ కాకుండా దేశవ్యాప్తంగా డెల్టా వేరియంట్ అతి భయకరంగా విజృంభిస్తున్న వేళ ఇది. అంతే కాకుండా కరోనా కేసులు, సంభవిస్తున్న మరణాల సంఖ్య కూడా ఇబ్బడిముబ్బడిగా ఉందనేది ప్రజల అభిప్రాయం కూడా.

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులను తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురి చేస్తున్నది. తాత్కాలిక షెడ్యూలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పై కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విద్యార్ధులను ఇంత అస్థిరత్వంలో ఉంచడం మంచిది కాదని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 15 రోజుల ముందు కచ్చితమైన షెడ్యూల్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంపై కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాత అన్ని రాష్ట్రాలూ పరీక్షలను వాయిదా వేశాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అలా ఎందుకు చేయలేకపోయిందని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఇలా మీరు చేయడానికి కారణం ఏమిటంటే మిమ్మల్ని మీరు ఈ దేశంలోనే ప్రత్యేకం మైన వ్యక్తిగా చూపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. గతంలో మీరు కరోనా వ్యాధి గురించి చెప్పిన మాటలు, తీసుకున్న నిర్ణయాలు చూస్తే కరోనా పట్ల, ప్రస్తుత సమస్య పట్ల మీరు ఎంత అవగాహనతో ఉన్నారో, మీ మానసిక స్థితి ఏమిటో ఇట్టే అర్ధం అవుతుంది.

మీరే నూతన మార్గదర్శి కావాలని మీరే అన్ని కీర్తి ప్రతిష్టలు కొట్టేయాలని విద్యార్ధుల జీవితాలతో ఇలా చెలగాటం ఆడుతున్నారని మేము భావించాల్సి వస్తున్నది కూడా ఇందుకే.

మన ప్రభుత్వం ఇంత మంకుపట్టు ఎందుకు పట్టిందో మాకు అర్ధం కావడం లేదు. లక్షలాది మంది విద్యార్ధుల జీవితాన్ని ఎందుకు పణంగా పెడుతున్నారో కూడా అసలు అర్ధమే కావడం లేదు.

మన రాష్ట్ర బోర్డు పరీక్షలు నిర్వహించకపోతే…. మిగిలిన అన్ని రాష్ట్రాల బోర్డులు పరీక్షలు పెట్టేస్తే…. మిగిలిన అన్ని రాష్ట్రాల విద్యార్ధులకు సీట్లు వచ్చేసి మన రాష్ట్ర విద్యార్ధులకు తీరని అన్యాయం జరుగుతుందని పాపం మీరు ఎంతో ఆవేదన చెందుతున్నట్లుగా ప్రజలు అర్ధం చేసుకున్నారు. ఇదే విషయాన్ని మీరు ఇప్పటికే చాలా సార్లు చెప్పి ఉన్నారు కూడా. విద్యార్ధుల భవిష్యత్తుపై మీరు చూపిస్తున్న ఆందోళన ఇప్పుడు వారి జీవితానికే శాపం అయ్యేలా ఉందని కూడా ప్రజలు తాజాగా అనుకుంటున్నారు.

తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఏమిటంటే కరోనా కారణంగా ఏ ఒక్క విద్యార్ధికి హాని జరిగినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు హెచ్చరించడం. ఇలాంటి అవాంఛనీయ సంఘటన ఏదైనా జరిగితే మీరు (ప్రభుత్వం) పూర్తి బాధ్యులని విద్యార్ధులు, తల్లిదండ్రులు వారి కుటుంబాలు చివరికి టీచర్లు కూడా భావిస్తున్నారు. మీకు ఎంత మంకుపట్టు ఉన్నా పొరబాటు జరిగితే దాన్ని మీరు సరిదిద్దలేరు.

అన్ని పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు తమకు చెబితే తప్ప, తాము సంతృప్తి చెందితే తప్ప పరీక్షల నిర్వహణకు అనుమతించేది లేదని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. రేపు మధ్యాహ్నం ఈ కేసును మళ్లీ విచారిస్తామని, ఈ లోపు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తుది అభిప్రాయం కనుక్కోమని ప్రభుత్వం తరపు న్యాయవాదులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం మీ దృష్టికి తీసుకువస్తున్నాను.

కనీసం….. కనీసం ఇప్పటికైనా మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా మీరు తక్షణమే ప్రకటించండి. తద్వారా మీ గౌరవానికే భంగం కలగకుండా ఉంటుందని మీ శ్రేయోభిలాషిగా మీకు సలహా ఇస్తున్నాను.

విద్యార్ధులను కరోనా రహిత పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్లి సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి మన వద్ద సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవన్నది నిజం. కరోనా మూడో దశ అత్యంత తీవ్ర స్థితికి వచ్చేస్తే జులై ఆఖరు నాటికి అనుసరించాల్సిన ‘‘అత్యవసర ప్రణాళిక’’ కూడా మన వద్ద సిద్ధంగా లేదు.

ఇలాంటి అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే దేశంలోని 18 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి (మిగిలిన రాష్ట్రాలలో పరీక్షలు ఇప్పటికే పూర్తి అయ్యాయి) మన ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిలో విజ్ఞతతో ఎందుకు ఆలోచించడం లేదో అర్ధం కావడం లేదు. ఇప్పటికైనా మీరు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఒక మంచి నాయకుడిలా ముందుకు రండి. విద్యార్ధుల, వారి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రాణాలను కాపాడేందుకు సరైన నిర్ణయం తీసుకుని పరీక్షలను రద్దు చేయండి.

భవదీయుడు

కె.రఘురామకృష్ణంరాజు

Related posts

ట్రాజిక్ ఎండ్: మేం ఈ లోకంలో బతకలేం వెళ్లిపోతున్నాం

Satyam NEWS

నరసరావుపేటలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

విద్యుత్ షాక్ తో ఇళ్లు కాలిపోయిన బాధితులకు ఆర్థిక సహాయం

Satyam NEWS

Leave a Comment