28.7 C
Hyderabad
April 26, 2024 08: 35 AM
Slider సంపాదకీయం

స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ఎందుకు వద్దంటున్నది?

#Dr.N.RameshkumarIAS

స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఉవ్విళ్లూరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెనకడుగు వేయడానికి కారణం ఏమిటి? స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను కులం పేరుతో దూషించడమే కాకుండా ఆయనను పదవీచ్యుతుడ్ని చేసేవరకూ వెళ్లిన అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలంటే వెనకడుగు వేస్తున్నది.

రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు డాక్టర్ రమేష్ కుమార్ ను మళ్లీ ఆ పదవిలో నియమించాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తినందున ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అయిష్టంగానే ఆయనకు పదవి కల్పించాల్సి వచ్చింది.

న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి

రమేష్ కుమార్ మళ్లీ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసినట్లు ఆ తర్వాత జరిగిన పరిణామాలు వెల్లడి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిన నిధులను ఇవ్వడం లేదని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదని డాక్టర్ రమేష్ కుమార్ మళ్లీ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన సంస్థలకు ప్రభుత్వం సహకరించాల్సిందేనని రాష్ట్ర హైకోర్టు విస్పష్టంగా చెప్పింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ రాత్రికి రాత్రే ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. మంజూరైన నిధులను కూడా నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టులో జరిగిన పరిణామాలు చూసిన అనంతరం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టి నిధులను విడుదల చేసింది.

మంత్రుల ప్రకటనలు దేనికి సూచిక?

ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన లో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించే విధంగా ఏక పక్షంగా రాష్ట్ర మంత్రులు ప్రకటనలు జారీ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తాము విముఖంగా ఉన్నామని రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, కొడాలి నాని బహిరంగంగా చెప్పేశారు.

ఇలా చెప్పడం ధర్మ విరుద్ధం. ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారు చూడటం కరెక్టు కాదు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను బహిరంగంగా దూషిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ సన్నని గీత కనిపించే అవకాశం లేదు.

శక్తిమంతమైన సోషల్ మీడియా ఉన్న వైసీపీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంతో శక్తిమంతంగా పని చేస్తుంది. క్షణాల్లో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సమాచారాన్ని ప్రపంచ స్థాయిలో విడుదల చేసేసి విస్తృత ప్రచారం కల్పించేస్తుంది.

డ్యామేజి కంట్రోల్ కు ఎదురుదాడే మందు అనే రీతిలో వారు పని చేస్తుంటారు. తద్వారా ప్రజాభిప్రాయాన్ని తమకు అనుగుణంగా మార్చేసుకుంటారు. ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా ఇప్పుడు చేస్తున్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెబితే అలా వినకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం చాలా తప్పు అని వాదించేవారు రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏదైనా స్వంతంత్ర నిర్ణయం తీసుకోగానే చంద్రబాబు చెప్పినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మెసేజీలు పుంఖాను పుంఖాలుగా వచ్చేస్తాయి.

దాంతో వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహించేవారు ఇలాంటి అనైతిక దాడులకు సిద్ధపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో ప్రాతినిధ్యం వహించే పార్టీలు చెప్పిన నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించాల్సి ఉంది. ఆ తర్వాత నిర్ణయాలు హైకోర్టు నిర్ణయాలకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది.

అసలు కారణం ఏమిటి?

రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నందున అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడం అత్యంత కష్టమే అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగించడానికి ఎందుకు విముఖంగా ఉంది అనే ప్రశ్న తలెత్తుతోంది.

దానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1. తన అభీష్టానికి వ్యతిరేకంగా పదవిలో కొనసాగుతున్న డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసే వరకూ స్థానిక సంస్థలు జరపడం ఇష్టం లేకపోవడం. 2. ఇటీవల తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత తమ పార్టీ సర్వేలలో బయట పడటం.

ఈ రెండింటిలో ఏదో ఒకటి కారణం కావచ్చు లేదా రెండూ కారణాలు కావచ్చు. ఈ రెండు కారణాలు కాదు అని అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలంటే తాము కూడా ఎన్నికలకు సిద్ధమే అని అఖిల పక్షసమావేశంలో ప్రకటించాల్సి ఉంటుంది.

కరోనా కారణం చెప్పి ఎన్నికలు జరిపేందుకు వీలులేదని ఇప్పుడు అంటే అప్పటిలో ఇదే కారణం చెప్పి ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ కరెక్టు అని ఒప్పుకోవడమే.

Related posts

చెరువులో నక్కిన మొసలి చేతికి చిక్కింది…

Satyam NEWS

నాన్ బెయిలబుల్ అఫెన్స్: గల్లా అరెస్టుపై పోలీసుల వివరణ

Satyam NEWS

వేప చెట్లకు తెగులుపై…

Bhavani

1 comment

Vinay Kumar October 28, 2020 at 2:41 AM

Nice

Reply

Leave a Comment