యువగళం నవశకం సభ విజయవంతంగా ముగిసింది. టీడీపీ పసుపు జెండాలు, జనసేన ఎరుపు జెండాలతో సభా ప్రాంగణమంతా పసుపు కుంకుమ వర్ణంతో నిండిపోయింది. టీడీపీ జనసేన పొత్తు చరిత్రాత్మకం అని, ఇది రాష్ట్రానికి అవసరమని చంద్రబాబు ఇచ్చిన పిలుపు.. జనాల్లోకి బలంగా వెళ్లింది. ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదని, వైఎస్ఆర్ సీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అని లోకేశ్ వదిలిన మాటలు బాణాల్లా తాడేపల్లి ప్యాలెస్ వైపునకు దూసుకెళ్లాయి.
చంద్రబాబు, లోకేశ్, బాలక్రిష్ణ – పవన్ కల్యాణ్ ఒకేవేదికపై కనిపించి తమ కలయిక బలం ఏ స్థాయిలో ఉందో చాటారు. ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ సీపీ పీడ వదలగొట్టాలని పిలుపు ఇచ్చారు. ఎన్నికల శంఖారావం ఈ వేదికపై నుంచే పూరించడంతో విజయనగరం జిల్లాలోని పోలిపల్లిలో జరిగిన యువగళం నవశకం సభ దద్దరిల్లింది. టీడీపీ-జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు లక్షల సంఖ్యలో సభకు వచ్చారు. ఈ సభ కనీవినీ ఎరగని రీతిలో జరగడం.. జనాలు హాజరైన తాలుకు డ్రోన్ విజువల్స్ చూసి జగన్ మతి పోయింది. అంతకుముందు అగ్ర నేతలు సభా వేదికకు వస్తుండగా అభిమానులు, ప్రజలు తమ అభిమాన నేతలకు జేజేలు పలికారు. దారి పొడవునా వారికి విపరీతమైన జనం స్వాగతం పలికారు. విపరీతమైన ట్రాఫిక్ జామ్ కూడా అయింది.
ఈ దృశ్యాలు తాడేపల్లి ప్యాలెస్‌లోని జగన్ కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై పూర్తిగా నమ్మకం చచ్చిపోయిన వైసీపీ అధినేత ఆఖరి రోజుల్లో తన వంతు ప్రయత్నంగా పార్టీలో విపరీతమైన ప్రక్షాళనలు చేస్తున్నారు. తాజాగా యువగళం నవశకం సభ చూసి మరింతగా ఆయన మనోధైర్యం కోల్పోయినట్లుగా తెలుస్తోంది. గత నాలుగైదు రోజులుగా ఎమ్మెల్యేలను పిలిపించుకొని, కొంత మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని, ఇంకొంత మందికి స్థాన చలనం ఉంటుందని మొహానే చెప్పేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎంత బతిమాలుకున్నా జగన్ తన తీరు మార్చుకోకపోతుండడంతో.. సదరు ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఆ అవకాశం లేని వాళ్లు ఇండిపెండెంట్ గా పోటీ చేసి, వైసీపీకి నష్టం చేయాలని చూస్తున్నారు.
అసలే ఎన్నికల్లో విజయంపై పూర్తిగా నమ్మకం కోల్పోయి విపరీతమైన భయాందోళనతో రోజులు గడుపుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈ యువగళం నవశకం సభ పెద్ద ఝలక్ ఇచ్చినట్లయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మీటింగులకు వచ్చే జనాలతో పోల్చితే.. అసలు కనీవినీ ఎరగని రీతిలో టీడీపీ సభకు ప్రజలు హాజరయ్యారు. జనంతో నిండుగా కనిపించేందుకు అప్పట్లో జగన్ ఇరుకు ప్రదేశంలో సభలు పెట్టుకునేవారు. దాన్ని సొంత మీడియాలో జనవాహినిలో ఓ భాగం అని ప్రచురించుకునేవారు. కానీ, టీడీపీ యువగళం సభకు సంబంధించి ఏకంగా డ్రోన్ విజువల్స్ ను విడుదల చేశారు. విశాలమైన సభాప్రాంగణంలో నిర్వహించిన ఈ సభలో ఆ మైదానం పట్టని రీతిలో జనం హాజరు కావడం పట్ల జగన్‌లోనే కాక, అటు ఉత్తరాంధ్ర నేతల్లోనూ ఆందోళన నెలకొంది.