38.2 C
Hyderabad
April 29, 2024 19: 58 PM
Slider సంపాదకీయం

‘‘పరీక్ష’’ విద్యార్ధులకు కాదు పాలకులకు

#Y S Jagan

ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఎట్టకేలకు విద్యార్ధుల తల్లిదండ్రులు విజయం సాధించారు. ఈ విజయం ఏదో అలవోకగా సిద్ధించలేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని అత్యంత తీవ్రమైన పదజాలంలో హెచ్చరికలు జారీ చేయడం వల్ల సిద్ధించింది.

దేశంలోని 18 రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయి. మరో 5 రాష్ట్రాలు కరోనా రెండో వేవ్ వచ్చే నాటికే పరీక్షలను పూర్తి చేశాయి. సీబీఎస్ఇ బోర్డు దేశంలోని అన్ని ఇంటర్ (12 క్లాస్) బోర్డులూ అనుసరించదగిన ఫార్ములాను సుప్రీంకోర్టు జోక్యంతో రూపొందించాయి.

ఇన్ని స్థాయిలలో ఇన్ని రకాలుగా పరీక్షలపై మల్లగుల్లాలు పడుతున్నా ఆంధ్రప్రదేశ్ మాత్రం కించిత్ కూడా ప్రత్యామ్నాయంపై ఆలోచించలేదు. ‘‘పరీక్షలు నిర్వహిస్తాం’’ అన్న ఒకే మాటకు కట్టుబడి ఉంది. రాజకీయాలలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ఆహ్వానించదగిన పరిణామమే కానీ ఇదేంటి?

ప్రజా ఆరోగ్యం విషయంలో పరిస్థితిని బట్టి నడచుకోవాలి. అలా కాకుండా మా నాయకుడు మాటతప్పడు మడం తిప్పడు అంటే కుదరదు. అలా కాదు మేం అంతే అని అధికార పార్టీ నాయకులు కచ్చితంగా చెబితే సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి ఉంటుంది.

ఇంటర్ పరీక్షల నిర్వహణలో సుప్రీంకోర్టు ఎంతో కర్కశంగా చెప్పింది. అలా చెబితేగానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అర్ధం కాలేదు. ఇంత స్థాయిలో సుప్రీంకోర్టు నుంచి హెచ్చరికలు వినడం అధికారంలో ఉన్న వారికి ఎలా ఉందో తెలియదు కానీ సాధారణ ప్రజలకు మాత్రం అత్యంత నీచంగా అనిపించింది.

అయితే తమ అసమర్థతను, తమ వక్ర ఆలోచనలను కప్పిపుప్చుకోవడానికి న్యాయస్థానాలపై మళ్లీ విషం చల్లారు తప్ప, ఇప్పటికీ తాము చేసిన పనిలో (పరీక్షల నిర్వహణ విషయంలో) తప్పేంటో ఆత్మ పరిశీలన చేసుకోవడం లేదు. ‘‘కోర్టుల్లో తీర్పులు ఎవరో వెనక ఉండి చెప్పిస్తున్నారు’’ అనే అనుమానాలు ప్రజల్లో బలంగా నాటుకునేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

పిల్లలు చచ్చిపోతారు పరీక్షలు పెట్టవద్దు అని చెప్పడం కూడా వెనక ఎవరో ఉండి చెప్పించాలా? దేశంలోని 18 రాష్ట్రాలకూ ఎవరో వెనక ఉండి చెప్పించారా? లాజిక్ లేదు.. కేవలం న్యాయస్థానాలపై బురద చల్లడమే వారి ఉద్దేశం గా కనిపిస్తున్నది.

పరీక్షా హాల్ కు కేవలం 15 మంది విద్యార్ధులతో పరీక్ష నిర్వహిస్తామని అఫిడవిట్ లో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎన్ని గదులు అవసరం అవుతాయి? ఎన్ని అందుబాటులో ఉన్నాయి? అనే లెక్క చెప్పలేదు.

ఈ ప్రశ్నలు అడగడం కూడా కోర్టుల తప్పు ఎలా అవుతుంది? ఇదే కరోనా లెక్కలు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా కోరారు… ఎన్నికలు నిర్వహించే వీలులేదన్నారు. ఇదే కరోనా పేరు చెప్పి ఎన్నికలు వాయిదా వేస్తే వాయిదా వేసిన వాళ్లను తిట్టిపోశారు. ఇదే కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు పెట్టించేశారు.

మా ప్రాణాలు పోతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యత వహిస్తాడా? అని ఏపి ఉద్యోగ సంఘాల వారితో ప్రశ్నించేలా చేశారు. ఇప్పుడు ఇదే ప్రశ్న సుప్రీంకోర్టు వేస్తే తప్పు ఎలా అవుతుంది? దీని వెనుక ఎవరో ఉన్నారని అనుమానం కలిగే విధంగా ప్రకటనలు చేయడం, సోషల్ మీడియాలో వ్యతిరేకార్ధాలు వచ్చే విధంగా పోస్టింగులు పెట్టించడం…. ఎవరిని మభ్య పెట్టడానికి?…. తెలీదు….

ఏకపక్షంగా దారుణమైన కేసులు పెట్టినా కోర్టులు జోక్యం చేసుకోకూడదు… ఏకపక్షంగా కేసులు ఉప సంహరించుకున్నా కోర్టులు జోక్యం చేసుకో కూడదు.. ఎంపిని లాకప్ లో పడేసి కొట్టినా కోర్టులు జోక్యం చేసుకోకూడదు.. ఎలా? ఇలా రాజ్యం నడుస్తుందా?

ఈ ప్రశ్నలన్నీ అడగడం చాలా మంది మానుకున్నారు. ఎందుకో తెలుసా? ఇలా అడిగిన ప్రతివాడ్నీ చంద్రబాబు తొత్తు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తారు. ఇలా చేయడం వల్ల తమకు వ్యతిరేకంగా మాట్లాడిన ‘న్యూట్రల్స్’ ను చంద్రబాబు వైపు బలవంతంగా పంపేసి చంద్రబాబును బలోపేతం చేస్తున్నారు.

ప్రస్తుతం గొప్పగా అనిపించే ఈ స్ట్రాటజీ ఇంకో రెండేళ్లు గడిచిన తర్వాత అసలైన ఫలితం ఇస్తుంది. కోర్టుల్ని తిట్టడం, తమను విమర్శించిన వాళ్లంతా చంద్రబాబు మనుషుల కిందకి లెక్కించడం మానుకుంటే ప్రభుత్వానికి కొంచెమైనా విశ్వసనీయత పెరుగుతుంది.

వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ‘‘ఆ రెండు పత్రికలు’’ అనే వారు. ఇప్పుడు ఆ సంఖ్యను ‘‘ ఆ ఆరు మీడియా సంస్థలు’’ అనే స్థాయికి జగన్ తెచ్చుకున్నారు. కరోనా సమయంలో పరీక్షలు వద్దు అని చెప్పిన వాళ్లంతా చంద్రబాబు మనుషులు ఎలా అవుతారు? తెలియదు. అది అంతే.

రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదు అని ఒక న్యాయమూర్తి చెబితే దాన్ని సవరించుకుంటాం అని చెబితే సరిపోతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలా చేయలేదు. ఆ వ్యాఖ్యపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వద్దు అని చెప్పిన న్యాయమూర్తులను కూడా చంద్రబాబు ఖాతాలోకి నెట్టారు. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్ నియమించిన న్యాయమూర్తులను కూడా చంద్రబాబు ఎకౌంట్ లోనే వేశారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకూ లెక్కకు మించినంత మంది న్యాయమూర్తులను చంద్రబాబు ఖాతాలోకి నెట్టిన ఘనత అధికార పార్టీకే దక్కింది.

న్యాయవ్యవస్థలో చంద్రబాబు మనుషులు ఎక్కువగా ఉన్నారు అందుకే తమకు వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయని చెప్పడానికి అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది తప్ప ‘‘రూల్ ఆఫ్ లా’’ కు వ్యతిరేకంగా వెళ్లడం వల్ల ఇలాంటి తీర్పులు వస్తున్నాయేమో అని ఒక్క సారి ఆలోచించి ఉంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదు.

ఇప్పటి వరకూ కొన్ని వందల సార్లు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చి ఉండేవి కాదు. వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన వాటిని అమలు చేయడం లేదనే విషయం ఏదో ఒక నాటికి మళ్లీ చర్చకు వస్తుంది. అప్పుడు మరింతగా చిక్కులు పెరుగుతాయి.

ఇప్పటికే ఒక కేసులో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు వారం రోజులు జైలు శిక్ష విధించారు ( తర్వాత రీకాల్ చేశారు) డిజిపి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. ప్రభుత్వంలో ఉన్నవారు తమ ఆలోచనా సరళి మార్చుకోకపోతే ఇలాంటి సంఘటనలు మరిన్ని జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నది.

ఇప్పటి వరకూ వచ్చిన అన్ని కేసుల్లోనూ కేవలం అధికారులు మాత్రమే దోషులుగా నిలబడ్డారు. అందువల్ల మంత్రులకు, ముఖ్యమంత్రికి నొప్పి తెలియడం లేదు. కోర్టుకు పోయేది అధికారులే కదా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

అయితే పరువు పోతున్నది రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి. రాష్ట్ర పాలకులకు. పోయేది అధికారులే కదా అన్నట్లు నిర్ణయాలు తీసుకుంటే అధికారులు తెలివి తక్కువ వారు కాదు… ఎక్కడో అక్కడ ఈ పాటికే ఈ రాజకీయ నాయకులను కూడా ఇరికించే ఉంటారు.

అది బయటకు రావడానికి మరి కొంత సమయం పడుతుంది. అంతే.

Related posts

హోమియో చికిత్స: కరోనా ‘ థర్డ్ వేవ్ ‘ థండర్

Satyam NEWS

రైతు వేదికల నిర్మాణాల్లో వేగం పెంచాలి

Satyam NEWS

అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది

Bhavani

Leave a Comment